ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధానమంత్రి..

SMTV Desk 2018-06-11 14:26:37  Former prime minister AB Vajpayee, AB Vajpayee, AB Vajpayee in aims, delhi

ఢిల్లీ, జూన్ 11 : బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయిని సోమవారం దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో చేర్చారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఎయిమ్స్‌లో చేరారని వైద్యులు చెప్పినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్‌ సంచాలకులు డా.రణ్‌దీప్‌ గులేరియా ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా డా.గులేరియా వాజ్‌పేయికు వ్యక్తిగత ఫిజీషియన్‌గా ఉంటున్నారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా వాజ్‌పేయి ఇంటికే పరిమితమయ్యారు. బీజేపీకు చెందిన ఎటువంటి కార్యక్రమాలకు ఆయన హాజరుకావడం లేదు. వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చేరిన విషయాన్ని బీజేపీ ధ్రువీకరించింది. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్‌గా ఉన్న వాజ్‌పేయి.. భారత దేశానికి పదో ప్రధానిగా పనిచేశారు. కాంగ్రెసేతర ప్రధానిగా దేశాన్ని ఐదేళ్లు పాలించిన ఘనత కూడా వాజ్‌పేయిదే. వివాదరహితుడిగా ప్రతిపక్ష పార్టీలతోపాటు పలువురి ప్రశంసలు ఆయన అందుకున్నారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్‌ మీడియాలో పలువురు మెసేజ్ లు పెడుతున్నారు.