సమ్మె సమస్య సద్దుమణిగింది..

SMTV Desk 2018-06-10 19:11:32  tsrtc strike, cm kcr vs tsrtc, tmu union, TSRTC

హైదరాబాద్, జూన్ 10 : రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య వివాదంకు తెరపడింది. ఆర్టీసీ ఉద్యోగులకు 16శాతం ఐఆర్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మంత్రి ఈటెల రాజేందర్‌ మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్‌కు అండగా బస్సు చక్రాలను కదలనీయకుండా చేసిన ఆర్టీసీ కార్మికుల గొప్పతనం కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రిపై విశ్వాసంతో వారు 25 శాతం ఐఆర్‌ అడిగారన్నారు. కేసీఆర్‌ కార్మిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో కమిటీ వేసి చర్చించి 16 శాతం ఐఆర్‌ ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కార్మిక పక్షపాతి అని వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, అసంఘటిత కార్మిక సంఘాలవైపే సీఎం దృష్టి సారించారని అన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి హరీష్‌ రావు అటు కార్మిక సంఘం నాయకుడిగా, ఇటు మంత్రిగా ద్విపాత్రాభినయం చేశారని కొనియాడారు. అనంతరం మంత్రి మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన 16 శాతం ఐఆర్‌తో నెలకు 16కోట్లు, ఏడాదికి 200 కోట్ల రూపాయల వరకూ భారం పెరిగిందని అన్నారు. అయినా కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉందని, లాభాల బాట పట్టించడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఏర్పడని నాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలో పయనింపజేసేందుకు సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్నారని రాష్ట్రమంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ కార్మిక పక్షపాతి అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది కార్మికులను ఆర్టీసీ నాయకులు నడిపించడంతో వారి సమస్యలను ముఖ్యమంత్రి పరిశీలించారన్నారు. భవిష్యత్తులో చేపట్టే సంస్కరణలకు కార్మికులు కూడా సహకరించాలన్నారు. టీఎంయూ గౌరవాధ్యక్షుడి పాత్రలో హరీశ్‌రావు సమస్య పరిష్కారానికి విశేష కృషి చేశారన్నారు. ప్రభుత్వం 16శాతం ఐఆర్‌ ప్రకటించడంపై తెలంగాణ మజ్దుర్‌ యూనియన్‌ నాయకుడు అశ్వత్థామ రెడ్డి హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సమ్మె నోటీస్‌ను ఉపసంహరించుకొన్నామని ప్రకటించారు.ఆర్టీసీ ముక్కలు చేయమని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కార్మికులందరు కష్టపడి పనిచేసి తెలంగాణ ఆర్టీసీని దేశంలో అగ్రస్థానంలో ఉంచుతామన్నారు.