ఆ విషయాన్ని ప్రధానిని అడిగి చెప్తా..

SMTV Desk 2018-06-10 11:56:01  nirmala sitharaman, tamilanadu incident, pm modi about, sterlite copper factory

ఢిల్లీ, జూన్ 10 : తమిళనాడులోని తూత్తుకూడి స్టెరిటైల్‌ రాగి కర్మాగారం వద్ద ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతిచెందారు. కాగా ఈ అంశంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు తూత్తుకూడి బాధితులను పరామర్శించి వారికి నష్టపరిహారం కూడా ఇచ్చారు. అయితే ప్రధాని స్పందించకపోవడంపై విపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి. తూత్తుకూడి కూడా భారత్‌లోని ప్రాంతమేనని అంత దారుణం జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ప్రధాని మౌనంగా ఉండడం సబబు కాదని ప్రతిపక్షాలు ఆరోపించారు. దీనిపై తాజాగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. శుక్రవారం చెన్నైలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి..‘ప్రధాని ఎందుకు తూత్తుకూడి ఘటనపై స్పందించడంలేదు?’ అని ప్రశ్నించారు. దీనికి నిర్మాల స్పందిస్తూ.." తూత్తుకుడిలో ఎందుకు 99 రోజుల పాటు ఆందోళనలు జరిగాయి? అసలు ఆందోళన ఎందుకు జరిగింది? ఆ 99 రోజులు ప్రశాంతంగానే ఆందోళనలు జరిగాయి. కానీ వందో రోజు దురదృష్టవశాత్తు పోలీసుల కాల్పుల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నారని కర్మాగారాన్ని మూసివేయాలని ఆందోళన చేశామంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికే కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమిత్‌ షా కూడా స్పందించినట్లు నాకు గుర్తు. ప్రధాని ఎందుకు స్పందించట్లేదో ఆయన్ని ఆడిగి చెప్తాను" అని వ్యాఖ్యానించారు.