ఏపీలో బైపోల్స్ వస్తాయా..!

SMTV Desk 2018-06-06 17:35:04  ysrcp mps resignation, ap mp bypolls, ycp vs tdp, avinash reddy

అమరావతి, జూన్ 6 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించినట్టుగా ఆ పార్టీ ఎంపీలు ప్రకటించారు. బుధవారం స్పీకర్‌ను కలిసిన వైసీపీ ఎంపీలు ఈ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 6న తాము ఇచ్చిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని స్పీకర్‌కు మరోసారి స్పష్టం చేశామని, ప్రత్యేకహోదా డిమాండ్ తో ఈ రాజీనామాలు చేసినట్టుగా వివరించామని ఎంపీలు పేర్కొన్నారు. స్పీకర్ ధ్రువీకరణ పత్రాలను అడిగారని.. తాము అందచేస్తామని.. ఇంతటితో తమ రాజీనామాలు ఆమోదం పొందినట్టే అని వారు వివరించారు. మరి వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితే ఉప ఎన్నికలు వస్తాయా...? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజీనామాలు చేసిన వారిలో తిరుపతి ఎంపీ వరప్రసాద్, నెల్లూరు ఎంపీ రాజమోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు ఉన్నారు. వీరి రాజీనామాల ఆమోదంతో.. ఈ స్థానాలకు ఎంపీ సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఉప ఎన్నికలు అనివార్యం అని చెప్పాలి. కానీ కచ్చితంగా వస్తాయా? అంటే కొంతమంది ఔను..! అని, మరికొందరు కాదు..!అని అంటున్నారు. మరి బైపోల్స్ వస్తాయా..రావా.. అంటే 1951 చట్ట ప్రకారం వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. అదేలాంటే... >> 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151-ఏ ప్రకారం.. లోక్‌సభ సభ్యుల పదవీకాలం ఏడాదిలోపు ఉంటే.. ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించదు. >> ప్రస్తుత పార్లమెంట్ 2014 జూన్ నాలుగో తేదీన సమావేశమయింది. ఈ ఏడాది జూన్ నాలుగో తేదీకి నాలుగేళ్లు పూర్తయిపోయాయి. అంటే ఎంపీల పదవీ కాలం ఇంకా ఏడాది కూడా లేదు. రాజీనామాలు ఆమోదించినా.. ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదు. >> ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే... బీజేపీ కూడా ఉప ఎన్నికలు నిర్వహించే ధైర్యం చేయలేదు. ఎందుకంటే.. ఒక వేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే కర్ణాటకలో యడ్యూరప్ప,శ్రీరాములు రాజీనామా చేసిన స్థానాలకూ జరిపించాల్సి ఉంటుంది. అదో రిస్క్… ఉపఎన్నికలంటే హడలిపోతున్న బీజేపీ ఇప్పుడా ఆ సాహసం చేసే సమస్యే లేదు. కాబట్టి ఉప ఎన్నికలు జరిగేందుకు అవకాశం లేదు.