భారత్ జోరుకు బ్రేక్ వేసిన బంగ్లాదేశ్..

SMTV Desk 2018-06-06 16:37:20  Womens Asia Cup T20,, india vs bangladesh match, aisa women cup t-20, Rumana Ahmed

కౌలాలంపూర్, జూన్ 6 : మహిళా ఆసియా కప్ టీ20లో టీమిండియా మహిళల జట్టు జోరుకు పసికూన బంగ్లాదేశ్ జట్టు బ్రేక్ వేసింది. బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో గెలిచి బంగ్లాదేశ్ జట్టు టోర్నమెంట్‌లో రెండో విజయాన్ని నమోదుచేసింది. భారత్ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వాస్తవానికి బంగ్లాదేశ్ 43 పరుగులకే ఈ మూడు వికెట్లను కోల్పోయింది. కానీ బంగ్లా జట్టులో ఫర్గానా హోక్ (46 బంతుల్లో 52), రుమానా అహ్మద్ (34 బంతుల్లో 42) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 93 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని ఏర్పరచడమే కాకుండా జట్టుకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించారు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో బంగ్లా జట్టు 19.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు సాధించి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా బౌలర్లలో పూజా వస్ర్తాకర్(1/21), రాజేశ్వరీ గైక్వాడ్(1/26), పూనమ్ యాదవ్(1/21) కొంతమేర కట్టడిచేసే ప్రయత్నం చేసినా మిగతా వారు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(42), దీప్తి శర్మ(32) మాత్రమే చెప్పుకోదగ్గస్థాయిలో బ్యాట్‌తో ఆకట్టుకోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్‌వుమెన్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. బంగ్లా బౌలర్లలో రుమానా(3/21) భారత్‌ను కట్టడి చేసింది. టోర్నీలో భాగంగా భారత్‌ తన తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొట్టనుంది. గురువారం ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయాలు నమోదు చేసుకున్న టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.