పాక్ స్మగ్లర్ల పనితనం.. సరిహద్దుల్లో డ్రగ్స్ కలకలం..

SMTV Desk 2018-06-06 15:46:08  Pakistan drug smugglers, Pakistan drug mafia, punjab drones, new delhi

న్యూఢిల్లీ, జూన్ 6 : కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతతో లాభాలు ఎలా ఉన్న.. నష్టం కూడా అంత కంటే ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ వాడుకలో డ్రగ్ మాఫియా సరికొత్త విధానంతో దిగింది. ప్రపంచంలోని అతి పెద్ద టెక్ కంపెనీలు డ్రోన్ల సాయంతో పుస్తకాలు, పిజ్జాలను ఇంటి వద్దకే పంపిస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, దాయాది పాకిస్థాన్ డ్రగ్ మాఫియా ఇప్పటికే డ్రోన్ల సాయంతో హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలను పంజాబ్ సరిహద్దుల్లోని గ్రామాల్లోకి అక్రమంగా తరలిస్తోంది. పంజాబ్ సరిహద్దు గ్రామాలకు పాక్ నుంచి డ్రోన్ల సాయంతో డ్రగ్స్‌ను సరఫరా చేస్తుండగా భారత సరిహద్దు దళం(బీఎస్‌ఎఫ్) జవాన్లు గుర్తించారు. తాజాగా గురుదాస్‌పూర్ గ్రామంలోకి డ్రోన్ సాయంతో మాదకద్రవ్యాలను పంపినట్టు బీఎస్ఎఫ్ నిఘా విభాగం గుర్తించింది. ఓ ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసిన డ్రగ్స్‌తో కూడిన డ్రోన్‌ ఒకటి 200 మీటర్ల ఎత్తు నుంచి ఎగురుకుంటూ రావడాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి. నిఘా వర్గాలు పసిగట్టడంతో డ్రగ్స్ డెలివరీ చేయకుండానే ఆ డ్రోన్ పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. పాకిస్థాన్ ముఠాలు ఆధునిక పద్దతుల ద్వారా డ్రగ్స్‌ను సరఫరాకు చేయడంతో బీఎస్ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్‌లోని 553 కిలోమీటర్ల భారత్- పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం అబోహర్, ఫిరోజ్‌పూర్, అమృత్‌సర్, గురుదాస్‌పూర్ జిల్లాలో హెరాయిన్‌ను పాక్ ముఠాలు అక్రమంగా రవాణా చేస్తున్నాయిని బీఎస్ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి.