సాకర్ సంబరం ముందు.. చిక్కుల్లో పడ్డ మెక్సికో

SMTV Desk 2018-06-06 14:19:14  Mexico football team, mexico Prostitute scandal, fifa world cup, mexico

మెక్సికో, జూన్ 6 : ఐపీఎల్ ఫీవర్ తో ముగిసింది. ఇప్పుడు సాకర్ సంబరం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ నెల 14న రష్యాలో ప్రారంభమయ్యే ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పలు జట్లపై వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. తాజాగా మెక్సికో ఫుట్‌బాల్‌ టీం ఓ వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ కప్ నేపథ్యంలో మెక్సికో టీం యూరప్‌ బయలుదేరేముందు ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే 30 మంది వేశ్యలు ఈ వీడ్కోలు పార్టీలో పాల్గొన్నట్లు ఓ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపింది. జట్టులోని తొమ్మిది మంది ఆటగాళ్లు గత శనివారం మెక్సికో సిటీలోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్‌లో వేశ్యలతో కలిసి పార్టీ చేసుకున్నారని టీవీ నోటస్‌ గాసిప్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. స్కాట్లాండ్‌పై 1-0 తేడాతో విజయం అనంతరం ఈ పార్టీ జరిగినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను కూడా ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఆటగాళ్లకు సెలవు రోజున స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. ఆటగాళ్లు ట్రైనింగ్‌ సెషన్‌ను మిస్‌ చేయలేదని.. వారిపై ఎలాంటి చర్యలు ఉండవని చెప్పారు. ఈ పార్టీలో పాల్గొన్న ఆటగాళ్లలో గోల్‌కీపర్‌ గైల్లెర్మో, రాల్‌ జిమెనెజ్‌ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం మెక్సికో టీం కోపెన్‌హగెన్‌లో ఉంది. రష్యాకు వెళ్లే ముందు వారు డెన్మార్క్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్నారు. గతంలో కూడా మెక్సికో జట్టుపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 2010, సెప్టెంబర్‌లో మెక్సికో ఆటగాళ్లు ఓ మ్యాచ్‌ అనంతరం మహిళలతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందులో పాల్గొన్న పలువురు ఆటగాళ్లకు జరిమానా విధించిన జట్టు అధికారులు.. పలువురిని ఆర్నెల్ల పాటు సస్పెండ్‌ చేశారు.