బ్రేకింగ్ న్యూస్ : సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా..!

SMTV Desk 2018-06-06 13:29:19  ca chief excutive, James Sutherland, australlia cricket chief, ca chief resignation

సిడ్నీ, జూన్ 6 : క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్‌లాండ్(52) సంచలన నిర్ణయం వెల్లడించారు. తన పదవి నుంచి త్వరలో తప్పుకోనున్నట్లు ప్రకటించడంతో ఆసీస్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సీఏ బోర్డు, చైర్మన్‌కు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత 17 ఏళ్లుగా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సీఈవోగా ఆయన సేవలు అందిస్తున్నారు. "సుమారు 20 ఏళ్లుగా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సేవలందిస్తున్నా. గుడ్‌బై చెప్పటానికి ఇదే సరైన సమయం. నేను తీసుకున్న ఈ నిర్ణయం నాకు, క్రికెట్‌ ఆస్ట్రేలియాకు మంచిదని భావిస్తున్నా" అంటూ ఈ ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ సెర్చ్‌ ఎజెన్సీ(ESA) ద్వారా నూతన సీఈవో నియామకం చేపట్టనున్నట్లు సీఏ ప్రకటించింది. అయితే కొత్తవారిని నియమించే వరకు ఆ పదవిలో కొనసాగాలని సీఏ సదర్‌లాండ్‌కు కోరినట్లు తెలుస్తోంది. సదర్ లాండ్ 12 నెలల నోటీస్ పీరియ‌డ్‌ ఇచ్చారు. ఈలోగా సీఈవోగా సరైన వ్యక్తిని నియమించే వరకు సదర్ లాండ్ సీఈవోగా కొనసాగనున్నారు. 1998లో సీఏలో సభ్యుడిగా తన ప్రస్థానం కొనసాగించిన జేమ్స్‌ సదర్‌లాండ్‌, 2001 నుంచి సీఈవోగా కొనసాగుతున్నారు. ఆయన నాయకత్వంలో సీఏలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. బోర్డు రెవెన్యూ గణనీయంగా పెరిగిపోయింది. అయితే తర్వాతి కాలంలో అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సెలక్షన్‌ కమిటీ నిర్ణయాల్లో ఆయన జోక్యం ఎక్కువైందని, ముఖ్యంగా బిగ్‌ బాష్‌ లీగ్‌ టోర్నీల్లో లాబీయింగ్‌లు చేశారని ఆయనపై ఆరోపణలు వినిపించాయి. కాగా ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.