రేపు ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటికానున్న అమిత్‌ షా ...

SMTV Desk 2018-06-05 15:28:13  uddhav thackeray, bjp amith shah, maharastra, sivasena, amith shah

ముంబై, జూన్ 5 : శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా రేపు భేటి కానున్నారు. ముంబయిలోని ఉద్ధవ్‌ నివాసంలో వీరి సమావేశం జరగనుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు తిరిగి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఉద్ధవ్‌ను కలుస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘ మిత్రపక్షమైన శివసేన ఇటీవల బీజేపీపై తన వైఖరి మార్చుకున్న సంగతి తెలిసిందే. బహిరంగంగానే శివసేన పార్టీ ఆ పార్టీ సీనియర్‌ నేతలపై విమర్శలు చేస్తోంది. మహారాష్ట్రలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా శివసేన విడిగా పోటీ చేసింది. అయితే పాల్‌ఘర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ గెలుపొందింది. ఉద్ధవ్‌ను కలిసేందుకు అమిత్‌షా సమయం కోరారని, రేపు సాయంత్రం ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్ధవ్‌ను కలవాల్సిన అవసరమేంటని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. పాల్‌ఘర్‌లో విడిగా పోటీ చేసి తాము ఒంటరిగా పోటీ చేయగలమని నిరూపించామని సంజయ్‌ వెల్లడించారు. తాము ఓడిపోయినప్పటికీ, ఓ సందేశం మాత్రం పంపగలిగామని అన్నారు.