2786 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ గ్రీన్ సిగ్నల్..

SMTV Desk 2018-06-02 19:57:32  tspsc notification, tspsc jobs, telangana, hyderabad

హైదరాబాద్‌, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేళ టీఎస్‌పీఎస్సీ 2786 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-4, వీఆర్వో, ఆర్టీసీ, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌వో), హోం, రెవెన్యూ శాఖలో స్టెనో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 5 నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆయా పరీక్షలకు ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి? విద్యార్హతలు ఏమిటి? పరీక్షలు ఎప్పుడనే విషయాలను ప్రకటించింది. గ్రూప్‌-4లో 1421, ఆర్టీసీలో 31 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ నెల 7 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. వీటన్నింటికీ అక్టోబర్‌ 7న పరీక్ష నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్‌లో కీలకమైనది వీఆర్వో ఉద్యోగాలు. వీటికి లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి ఈ నెల 8 నుంచి జులై 2 వరకు దరఖాస్తులు స్వీకరించి సెప్టెంబర్‌ 16న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తమ్మీద వీఆర్వో ఉద్యోగాలకు ఇంటర్‌ కనీస విద్యార్హతగా నిర్ణయించారు. మిగతా ఉద్యోగాలకు మాత్రం సాధారణ డిగ్రీ ఉండాలి. అలాగే, ఎకనమిక్స్‌, స్టాటిస్టిక్స్‌ విభాగంలో సహాయ గణాంక అధికారి, మండల ప్రణాళికా గణాంక అధికారి ఉద్యోగాలు 774 భర్తీ చేయనున్నారు. వాటికి సంబంధించి ఈ నెల 8 నుంచి జులై 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి సెప్టెంబర్‌ 2న పరీక్ష నిర్వహిస్తారు. రెవెన్యూ, హోంశాఖలలో 19 స్టెనో ఉద్యోగాలకు ఈ నెల 11 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే, ఈ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారనేది తర్వాత నిర్ణయించనున్నారు.