ఏపీ కొత్త పోలీస్ బాస్ ఎవరు...!

SMTV Desk 2018-06-02 16:36:32  ap dgp, goutham savang, ap dgp selection, r.p thakur

విజయవాడ, జూన్ 2 : సాధారణ ఎన్నికల నుండి నగరంలో శాంతి భద్రతాలకు విఘాతం కలగకుండా చూసుకునే బాధ్యత పోలీస్ వ్యవస్థదే. అంతటి వ్యవస్థకు బాస్ డీజీపీ. కాగా ప్రస్తుత డీజీపీ పూనం మాలకొండయ్య పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త బాస్ ఎంపికపై దృష్టిసారించింది. సమీప భవిష్యత్ లో పంచాయతి ఎన్నికలు ఉండటం.. ఏడాదిలోగా సాధారణ ఎన్నికలు రానున్న క్రమంలో ఎవరిని ఎంపిక చేయాలనీ ప్రభుత్వ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో తదుపరి డీజీపీ ఎవరు అవుతారని పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు డీజీపీగా ఎంపిక ప్రక్రియ కేంద్రప్రభుత్వ పరిధిలో ఉండేది. ఈ పదవికోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఓ జాబితాను రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం పంపేది. ఆ జాబితాలో ఒకరిని డీజీపీగా ఎన్నుకోనేవారు. ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన సర్కారు నియామక ప్రక్రియలో మార్పులు చేసింది. ఇప్పటివరకు పోలీస్ శాఖలో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారికి డీజీపీ పదవి కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన అభీష్టం మేరకు ఈ పదవికి ఎంపిక చేసుకొనేలా నిబంధనలు సడలించింది. దీంతో ఈ సారి ఈ పదవి ఎవరిని వరిస్తోందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం సీనియారీటి ప్రకారం చూస్తే గౌతం సవాంగ్, ఆర్.పీ.ఠాకూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. విజయవాడ నగర కమిషనర్ గా గౌతం సవాంగ్ ..అవినీతి నిరోధక శాఖ డీజీగా ఆర్.పీ.ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీనియరీటి ప్రకారం చూస్తే వీరిద్దరిలో ఎవరికో ఒకరికి పోలీస్ బాస్ పదవి వరించే అవకాశం ఉంది. వారితో పాటు 1986 ఆగస్ట్ 25న నియామకమైన వీ.ఎస్.కే. కౌమది, వినయ రంజన్ రాయ్ డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీస్ లలో ఉన్నారు. ఏదైనా కారణాలతో సీనియారీటిని పక్కన పెడితే 1987 బ్యాచ్ అధికారుల వైపు ప్రభుత్వ వర్గాలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ బ్యాచ్ లో త్రిపాఠి, అనురాధ, ఎన్వీ. సురేంద్రబాబు, సంతోష్ మెహర పేర్లు పరీశీలనలోకి రావచ్చు. అయితే వీరిలో ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనురాధ కు ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఏది ఏమైనా డీజీపీ ఎంపికలో ఎటువంటి వివాదాలకు తావులేకుండా క్రతువు పూర్తి చేయాలనీ సర్కారు భావిస్తోంది అని అధికార వర్గాలు చెబుతున్నాయి.