ఐపీఎల్-2019 మార్చిలోనేనా..!

SMTV Desk 2018-06-01 15:57:19  ipl-12 season, ipl-12, ipl-11 csk, ipl-12 season

ఢిల్లీ, జూన్ 1 : ఐపీఎల్-2018 హంగామా వెళ్లిపోయింది. ఏప్రిల్ 7న మొదలైన ఈ సమరం మే 27తో ముగిసింది. ఈ సీజన్ విజేతగా రెండేళ్ల నిషేధం తర్వాత వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముచ్చాటగా మూడో సారి ట్రోఫీని ఎగేరేసుకుపోయింది. ఇక అప్పుడే క్రికెట్‌ అభిమానులంతా వచ్చే ఏడాది ఐపీఎల్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. 12వ సీజన్‌ గురించి ఇప్పుడే ఎందుకు చర్చించుకుంటున్నారని అనుకుంటున్నారా. 2019లో ఇంగ్లాండ్‌ వేదికగా ప్రపంచకప్‌ మే 30న ప్రారంభంకానుంది. నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్లు ఒక టోర్నీ ముగించుకుని మరో టోర్నీలో మ్యాచ్‌ ఆడేందుకు 15 రోజుల విరామం కచ్చితంగా ఉండాలి. అందుకే ఐపీఎల్‌ను ముందే నిర్వహించాలని అనుకుంటున్నారట. ఇంగ్లాండ్‌, వేల్స్‌ వేదికగా వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచకప్‌ జరగనుంది. సాధారణంగా ఐపీఎల్‌ ఏప్రిల్‌ ఒకటి లేదా రెండో వారంలో ప్రారంభమై మే చివరి వారంలో ముగుస్తుంది. కానీ, వచ్చే ఏడాది మే 3వ వారంలోనే ముగించాలి. అప్పుడే భారత ఆటగాళ్లకు ప్రపంచకప్‌లో మ్యాచ్‌ ఆడేందుకు 15 రోజుల వ్యవధి లభిస్తుంది. ఈ లెక్కన 2019లో మార్చి 29న మెగా ఐపీఎల్‌ టోర్నీకి తెరలేవనున్నట్లు సమాచారం. ఇంకో విషయం ఏంటంటే...12వ ఐపీఎల్‌ సీజన్‌ను భారత్‌లో కాకుండా మరో దేశంలో నిర్వహించాలని చూస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే సమయంలోనే మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత కల్పించడం చాలా కష్టం. ఈ కారణంగా ఐపీఎల్‌-2019ను వేరే దేశానికి తరలించాలనుకుంటున్నారట. గతంలో 2009లో ఇలాగే ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇన్ని పరిస్థితుల మధ్య బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.