జీఎస్‌టీ రాబడి రూ. 94,016కోట్లు..

SMTV Desk 2018-06-01 15:06:33  gst collection, gst collection in may, cgst and igst, delhi

ఢిల్లీ, జూన్ 1: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీఎస్‌టీ వసూళ్లు మే నెలలో రూ. 94,016కోట్లుగా నమోదయ్యాయి. గతనెల రాబడితో పోలిస్తే ఈ మే లో వసూళ్లు కాస్త తగ్గాయి. గత ఏప్రిల్‌లో గరిష్ఠంగా రూ. 1.03లక్షల కోట్లు జీఎస్‌టీ వసులయ్యాయి. గతేడాది జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇంత ఎక్కువ వసూళ్లు రావడం అదే మొదటి సారి. తాజా గణాంకాల ప్రకారం.. మే నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 94,016కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో జీఎస్టీ వసూళ్లు తగ్గినప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన నెలవారీ సగటు జీఎస్‌టీ కంటే ఇది ఎక్కువగానే ఉంది. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు జీఎస్‌టీ వసూళ్లు రూ. 89,885కోట్లుగా నమోదయ్యాయి. సర్దుబాటు అనంతరం సీజీఎస్‌టీ కింద కేంద్రానికి రూ. 28,797కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద రాష్ట్రాలకు రూ. 34,020కోట్ల ఆదాయం అందింది. మే 31 వరకు ఏప్రిల్‌ నెల రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 62.47లక్షలు గా ఉంది. మార్చి నెల జీఎస్‌టీ పరిహారం కింద మే 29న రాష్ట్రాలకు రూ. 6696కోట్లు విడుదల చేశారు. దీంతో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన నాటి (జులై, 2017) నుంచి మార్చి, 2018 వరకు రాష్ట్రాలకు అందించిన జీఎస్‌టీ పరిహారం రూ. 47,844కోట్లుగా నమోదయ్యింది.