చమురు వినియోగదారులకు కాస్త ఉపశమనం..

SMTV Desk 2018-05-30 11:25:34  petrol prices, petrol diesel, delhi, mumbai

ఢిల్లీ, మే 30 : గత 16 రోజులుగా వినియోగదారులను హడలెత్తిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నేడు కొంచెం తగ్గాయి. రూపాయి బలపడడంతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర 60పైసలు తగ్గగా, లీటరు డీజిల్‌ ధర 56పైసలు తగ్గింది. రాజధాని ఢిల్లీ నగరంలో లీటరు పెట్రోల్‌ ధర 60పైసలు తగ్గి రూ.77.83గా ఉంది. లీటరు డీజిల్‌ ధర 56పైసలు తగ్గి రూ.68.75కు చేరింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇచ్చిన వివరాల ప్రకారం నిన్న పెట్రల్‌ ధర రూ.78.43పైసలతో జీవనకాల గరిష్ఠానికి చేరింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోజురోజుకు పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. పక్షం రోజుల్లో మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.3.8 పైసలు పెరగగా, లీటరు డీజిల్‌ ధర రూ.3.38 పైసలు పెరిగింది. ధరల పెరుగుదలపై వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పన్నుల్లో తేడా కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మారుతూ ఉంటాయి. అన్ని మెట్రో నగరాలు, రాష్ట్రాల రాజధానులతో పోలిస్తే ఢిల్లీలో ధరలు తక్కువగా ఉంటాయి. ముంబయిలో నేడు పెట్రోల్‌ ధర 59పైసలు తగ్గి లీటరు రూ.85.65, లీటరు డీజిల్‌ ధర రూ.73.20గా ఉంది.