జీఎస్టీ పరిధిలోకి చమురు ధరలు..! : ధర్మేంద్ర ప్రధాన్

SMTV Desk 2018-05-29 15:12:17  petrol price, Dharmendra Pradhan, petrol price hike, Dharmendra Pradhan

భువనేశ్వర్‌, మే 29 : పెట్రోల్ ధరలు ఇప్పటిలో తగ్గేలా కనిపించటలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోజురోజుకు పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు.. వరుసగా 16వ రోజు కూడా పెరిగిపోయాయి. ఈ విషయంపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం మాట్లాడుతూ.. పెట్రోలు, డీజిలు ధరల కట్టడికి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని సమగ్రమైన ఒక పరిష్కారాన్ని కనుగొంటామని ఆయన అన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం దానిలో ఒక అంశమని ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. పెరుగుతున్న చమురు ధరల నుంచి వినియోగదారులకు ఎప్పుడు ఉపశమనం కలుగుతుందని విలేకరులు ప్రశ్నించగా, ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్నామని, ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాలని సమాధానమిచ్చారు. ప్రస్తుతం లీటరు పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం రూ.19.48, డీజిల్ పై రూ.15.33 ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. ఇదిగాక ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ అదనం. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరిన దగ్గరినుంచి ఇప్పటిదాకా లీటరు పెట్రోల్ ధరపై రూ.11.17, డీజిల్ ధరపై రూ.13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది.