కేంద్రంపై విరుచుకుపడ్డ చంద్రబాబు..

SMTV Desk 2018-05-29 13:17:46  CHANDRABABU NAIDU, AP CM FIRES ON CENTRAL, TDP MAHANADU, VIJAYAWADA

విజయవాడ, మే 29 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన హామీలు నెరవేర్చాలని అడిగితే కేంద్రం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. మహానాడు చివరిరోజు ‘ప్రజా రాజధాని- మన అమరావతి- ఆనంద నగరం’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. గుజరాత్‌కు ఇష్టం వచ్చిన రీతిలో నిధులు కేటాయించారని.. మనం రాజధాని కోసం అడిగితే మాత్రం రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ సహా కేంద్రానికి సమర్పించిన ఆధార సహిత యూసీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. "అమరావతిలో అనుకున్న పనులన్నీ పూర్తి కావాలంటే మొదటి విడత రూ.45వేల కోట్లు ఖర్చు పెట్టాలి. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తోంది. తెలుగు వారికి ఓ విశ్వనగరం ఉండాలన్న ఉద్దేశంతోనే అమరావతిని నిర్మిస్తున్నాం. మనం ఇచ్చిన పిలుపుతో రైతులు ఏకంగా 33వేల ఎకరాలు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. తెదేపా ప్రభుత్వం మీద ప్రజలకున్న విశ్వసనీయతను ఇది తెలియజేస్తోంది. అమరావతిలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులతో ఆస్పత్రులు వస్తున్నాయి. ఇచ్చిన యూసీలన్నీ తప్పని చెబుతోంది. మన రాష్ట్రంలోని కొన్ని పార్టీలు పదవుల కోసం పాకులాడుతూ కేంద్రానికి వత్తాసు పలుతుకున్నాయి. అభివృద్ధిని అడ్డుకునే ఎవరిని సహించేది లేదు" అని హెచ్చరించారు.