మోత్కుపల్లిపై వేటు వేసిన టీడీపీ

SMTV Desk 2018-05-28 19:15:02   Motkupalli Narasimhulu, ttdp leader l.ramana, Motkupalli narasimhulu, hyderabad

హైదరాబాద్‌, మే 28 :టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ సోమవారం వెల్లడించారు. ఇటీవల మోత్కుపల్లి విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారని.. కేసీఆర్‌ ఎన్టీఆర్‌కు ప్రతిరూపం అని ఆయన ఎలా చెబుతారని మండిపడ్డారు. మోత్కుపల్లి ద్రోహానికి క్షమాపణ లేదని రమణ అన్నారు. గవర్నర్‌ పదవి రాదని తెలిసి మోత్కుపల్లి గొడవ మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ రోజు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన మోత్కుపల్లి ఎన్టీఆర్‌ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించారని, తమ నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారని, అయితే పట్టపగలే అడ్డంగా దొరికిపోయారని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మరో వైపు టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుపై ఆ పార్టీకే చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోత్కుపల్లి తులసి వనంలో గంజాయి మొక్కలా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ రోజుతో మోత్కుపల్లికి. తెలుగుదేశం పార్టీకి బంధం తెగిపోయిందన్నారు. మోత్కుపల్లి నల్గొండ జిల్లా నుంచి పార్టీలో ఎవరినీ ఎదగనీయకుండా బ్లాక్ మెయిలర్‌గా వ్యవహరించాడని... ఆయన నిజస్వరూప౦ తెలిసే ఆనాడు ఎన్టీఆర్ టికెట్ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లి వచ్చినా చంద్రబాబు అనేక రకాలుగా ఆయన్ని ప్రోత్సహించారన్నారు. మోత్కుపల్లి ద్వoద్వ వైఖరిని అంతా గమనిస్తున్నారని వీరయ్య అన్నారు.