చంద్రబాబుపై మరోసారి మండిపడ్డ మోత్కుపల్లి..

SMTV Desk 2018-05-28 14:08:45   Motkupalli Narasimhulu, Motkupalli fires on chandrababu, hyderabad, tdp leader motkupalli

హైదరాబాద్, మే 28 ‌: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై ఆ పార్టీ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నందమూరి వంశాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన మోత్కుపల్లి కన్నీటిపర్యంతమయ్యారు. మోసకారి చంద్రబాబు తక్షణమే టీడీపీ అధ్యక్షపదవికి రాజీనామా చేసి, పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..." ఎన్టీఆర్ దయ వల్లే నాలాంటి పేదవాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. చంద్రబాబును నమ్ముకొని నేను మోసపోయాను. పార్టీలో నన్ను అణచివేయాలని కొందరు చూస్తున్నారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ పేరు వినపడుతూనే ఉంటుంది. తెలంగాణలో పార్టీ బాగుపడాలంటే తెరాసతో పొత్తు పెట్టుకోవాలని సూచన చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్‌ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించాడు. మా నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబే. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారు. కానీ పట్టాపగలే అడ్డంగా దొరికిపోయాడు. తెలుగుదేశం జెండా కళకళలాడాలంటే నందమూరి వారసులకే పార్టీ పగ్గాలు అప్పగించాలి" అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.