ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు..

SMTV Desk 2018-05-28 13:24:35  ntr birth anniversary, 95 th ntr birth anniversary, ntr, harikrishna:

హైదరాబాద్, మే 28 ‌: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, మనవలు జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న వారంతా ఎన్టీఆర్‌ సమాధి వద్ద పుష్ఫాలు ఉంచి నివాళులర్పించారు. దర్శకుడు క్రిష్‌ కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. ఎన్టీఆర్‌ జీవిత విశేషాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ 95వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె, సీనియర్‌ బీజేపీ నాయకురాలు పురందేశ్వరీ, ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావు కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ గురించి తాను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. ఆయన గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. దక్షిణ భారతీయులను మద్రాసీలుగా భావిస్తుంటే తెలుగు వారికి ప్రత్యేక చరిత్ర ఉందని విశ్వవ్యాప్తంగా చాటిన మహనీయులని ఆమె అన్నారు.