చైనాను తోసి అగ్రపథంలోకి భారత్

SMTV Desk 2017-07-10 17:47:31  India to the top of China

న్యూఢిల్లీ, జూలై 10 : ప్రపంచ ఆర్థిక వృద్ధికి కేంద్రంగా చైనాను తోసిపుచ్చి, భారత్ అగ్రపథంలోకి దూసుకెళ్తోందని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ సంస్థ అధ్యయనాలలో వెల్లడించింది. మరో పదేళ్ళ పాటు భారత్ ఆధిపత్యం ఇలాగే కొనసాగుతుందని వెల్లడించింది. సీఐడీ అంచనాల ప్రకారం.. భారత్ సగటున 7.7 శాతం వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోనుంది. 2025 వరకూ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో నిలవనుంది. ‘కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక వృద్ధి కేంద్రం, చైనా నుంచి భారత్‌ దిశగా అడుగులు వేసింది. వచ్చే దశాబ్దంపాటు భారత్‌ ఇదే పంథాను కొనసాగించే అవకాశముంది’ అని సీఐడీ అంచనా వేసింది. కొత్త రంగాలకు భారత్ పరిధిని విస్తరిస్తూ కొనసాగడం వల్లే ఈ వృద్ది రేటి పరుగులు తీస్తోందని తెలిపింది. కొన్ని సంక్లిష్టమైన రంగాలకూ భారత్‌ విస్తరిస్తోంది. అదే సమయంలో భిన్న, సంక్లిష్టమైన రంగాల ఉత్పత్తులతో భారత్‌, ఇండోనేసియా, వియత్నాం లాంటి దేశాలు కొత్త బాధ్యతలు తీసుకుంటున్నాయి. ఇవే ఆర్థిక వృద్ధికి బాటలు పరుస్తున్నాయని వివరించింది. భారత్‌, టర్కీ, ఇండోనేసియా, ఉగాండా, బల్గేరియా వంటి దేశాలు వేగంగా అభివృద్ధి చెందడమే కాక ఒకే వృద్ది మార్గాన్ని అంటిపెట్టుకోలేదని తెలిపింది. ఈ దేశాలు రాజకీయంగా, భౌగోళికంగా, జనాభా పరంగా భిన్నమైనవి. కార్మిక శక్తిని భిన్న రంగాలకు విస్తరిస్తున్నాయి. దీంతో కొత్త, సంక్లిష్టమైన రంగాల ఉత్పత్తుల్లో అగ్రపథాన నిలుస్తున్నాయని వివరించింది. సీఐడీ అంచనాల్లో భాగంగా దేశాలను మూడు ప్రాథమిక వర్గాలుగా విభజించారు. ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉన్న దేశాలలో మొదటిది- ఇవి సంబంధిత రంగాల్లో తమ పరిధిని సులువుగా విస్తరించగలవు. రెండవది- ఉత్పత్తిని భిన్న రంగాలకు విస్తరించే సామర్థ్యమున్న దేశాలు(భారత్‌, ఇండోనేసియా, టర్కీ దీనిలోనే ఉన్నాయి). మూడవదిగా- అన్ని వస్తువులనూ ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్న దేశాల వర్గం. దీనిలో జపాన్‌, జర్మనీ, అమెరికా లాంటి దేశాలున్నాయి.