ఏపీసీసీ ఇన్‌చార్జ్‌గా ఊమెన్‌ చాందీ..

SMTV Desk 2018-05-27 17:30:42  apcc incharge umman chandi, ap congress, digvijay singh, newdelhi

న్యూఢిల్లీ, మే 27 : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ బాధ్యతలను సీనియర్‌ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ను తొలగించింది. ఆంధ్రప్రదేశ్‌ ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీగా ఊమెన్‌ చాందీని వెంటనే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ ప్రశంసనీయమైన సేవలు అందించారని, ఆయన వెంటనే ఆ పదవి నుంచి దిగిపోతారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) వ్యవహారాల ఇన్ చార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు ఉమెన్ చాందీని నియమించడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీసీసీ ఓ ప్రకటన చేసింది. కేరళలో దశాబ్దాల తరబడి పార్టీని విజయపథంలో నడిపించిన నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అపార అనుభవం ఆయనకు ఉందని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మంచి అవగాహన కలిగిన ఉమెన్ చాందీ, పార్టీని ఏకతాటిపై నడిపించి పునర్ వైభవం తీసుకువస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.