కార్యకర్తలు లేకపోతే టీడీపీ లేదు : చంద్రబాబు

SMTV Desk 2018-05-27 13:50:57  #mahanadu, ap cm chandra babu naidu, mahanadu, tdp

విజయవాడ, మే 27 : కార్యకర్తలు లేకపోతే టీడీపీ పార్టీయే లేదని.. ఎంతోమంది కార్యకర్తల కష్టార్జితం, త్యాగాల ఫలితాలే ఈ రాష్ట్రం అభివృద్ధికి చిహ్నమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. విజయవాడ విజయానికి నాంది అని.. ఇక్కడ నుంచి ఏ పని చేపట్టినా విజయం తథ్యమన్నారు. ఈ మహానాడుకు తరలివచ్చిన ప్రతి కార్యకర్తకూ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..." టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రను అభివృద్ధి చేసే శక్తి ఒక్క టీడీపీకు మాత్రమే ఉందని నమ్మి ప్రజలు మనకు పట్టం కట్టారు. ఐటీని అభివృద్ధి చేయడం ద్వారా విదేశాల్లో తెలుగువారు సత్తా చాటుతున్నారు. పార్టీ కార్యకర్తల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కార్యకర్తలు లేకపోతే పార్టీయే లేదు. నాలుగు సంవత్సరాలుగా ఏపీలో అధికారంలో ఉన్నాం. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్నాం.. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైనా సాధించగలమని కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తల పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్‌ మెమోరియల్‌‌ పాఠశాల నిర్వహిస్తున్నాం. చాలామంది పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. "తెలుగువారు ఎక్కడున్నా వారి మంచి చెడులు చూసే ఏకైక పార్టీ తెలుగుదేశం. పది సంవత్సరాల కాంగ్రెస్‌ పాలన సమైక్యాంధ్రప్రదేశ్‌కు ఓ పీడకల. వారి పాలనలో ఎక్కడ చూసిన అవినీతే. రాష్ట్రాన్ని కుంభకోణాల మయంగా మార్చి అప్రతిష్టపాలు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్‌ అధికారులు జైలుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం చేయాలని పోరాడాం. రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం" అని పేర్కొన్నారు.