తుది పోరుకు రె"ఢీ"..

SMTV Desk 2018-05-27 11:52:29  #ipl final, srh vs csk, ipl final, dhoni

ముంబై, మే 27 : ఐపీఎల్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా ఈ రోజు ఫైనల్ ఫైట్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులు వాంఖేడ్ వేదికగా తలపడనున్నాయి. ఐపీఎల్ ట్రోఫీని రెండు సార్లు ముద్దాడిన చెన్నై, 2016 లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ సారి ఎలాగైనా కప్ నెగ్గాలని భావిస్తున్నాయి. బ్యాటింగ్ లో అదరగొడుతున్న ఎల్లో ఆర్మీ.. బౌలింగ్ లో దూసుకుపోతున్న ఆరంజ్ ఆర్మీ వీరిద్దరి మధ్య మ్యాచ్ హోరాహోరిగా సాగడం ఖాయం. మొత్తంగా చెన్నైకిది ఏడో ఫైనల్‌కాగా.. సన్‌రైజర్స్‌ మూడేళ్లలో రెండో ఫైనల్‌ ఆడబోతోంది. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి వచ్చిన చెన్నై అది నుండి ధోని సారథ్యంలో బాగానే రాణించి ఫైనల్ కు చేరింది. అటు బ్యాటింగ్ లో రాయుడు, వాట్సన్, డుప్లెసిస్, రైనా, ధోని, బ్రావోలతో బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. ఇక హర్భజన్‌ సింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ల చివరిలో బ్యాట్ ఝుళిపించే సత్తా ఉన్నవారే. ఇక బౌలింగ్ పరంగా చూసిన చెన్నై జట్టులో ఎంగిడి, బ్రావో, జడేజా, చాహర్‌, హర్భజన్‌లతో బౌలింగ్‌ దళం దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రెండు జట్లు 9 సార్లు తలపడగా.. చెన్నై 7సార్లు పైచేయి సాధించింది. సన్‌రైజర్స్‌ రెండేసార్లు నెగ్గింది. ఈ ఐపీఎల్‌లోనే చెన్నై.. 3 సార్లు హైదరాబాద్‌ను ఓడించింది. ఇక సన్‌రైజర్స్‌ టోర్నీ మొదటి నుండి బౌలింగే ప్రధాన ఆయుధంగా ముందుకు సాగిన ఆ జట్టు ప్లే ఆఫ్ లో కొంచెం తడబడింది. కానీ రషీద్ ఖాన్ బ్యాటింగ్, బౌలింగ్ లో చెలరేగడంతో క్వాలిఫైయర్-2 లో కోల్ కతా పై నెగ్గి తుది పోరులో నిలిచింది. భువనేశ్వర్‌, రషీద్‌ ఖాన్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ, షకిబ్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ తో బౌలింగ్ చాలా బలంగా ఉంది. మరో వైపు రషీద్ ఖాన్ ప్రత్యర్ధులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇక బ్యాటింగ్ లో టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేసిన సారథి విలియమ్సన్‌.. ప్లేఆఫ్స్‌లో ఆ స్థాయిలో బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. కీలకమైన ఫైనల్లో అతడితోపాటు మరో ఓపెనర్‌ ధావన్‌.. మిడిల్ ఆర్డర్ లో షకిబ్‌, యూసుఫ్‌ పఠాన్‌ వంటి వారు బ్యాటుతో రాణిస్తే రైజర్స్ కు తిరుగుండదు. చెన్నై సూపర్‌కింగ్స్‌ కీలకం: అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్, డుప్లెసిస్, బ్రేవో, ధోని బలం: ఓపెనర్లు, కెప్టెన్, ఆల్‌రౌండర్లు బలహీనత: నాణ్యమైన బౌలింగ్‌కు తలొంచడం ప్రత్యేకత: లీగ్‌లో 9 సార్లు పాల్గొని 7 సార్లు ఫైనల్‌ చేరిన జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలకం: కేన్‌ విలియమ్సన్, శిఖర్‌ ధావన్, రషీద్‌ ఖాన్, భువనేశ్వర్‌ కుమార్‌ బలం: కెప్టెన్‌ బ్యాటింగ్, రషీద్, భువీ బౌలింగ్‌ బలహీనత: బ్యాటింగ్‌లో తడబాటు ప్రత్యేకత: మూడేళ్లలో రెండోసారి ఫైనల్‌ చేరిక