జిల్లాలో రిజిస్ట్రార్ అధికారుల కుదింపు

SMTV Desk 2017-05-29 14:39:26  subregistars,decrease rights,district subregistars

హైదరాబాద్ , మే 29 : ఎనీవేర్ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు వెలుగుచూస్తున్న క్రమంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. అక్రమాలు, అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఎనీవేర్ విధానంలో లొసుగులను నివారించడానికి, మొత్తంగా రిజిస్ట్రేషన్లలో అక్రమాలను నిరోధించడానికి కఠినమైన ఆంక్షలతో సోమవారం ఉత్తర్వులను జారీచేయనుంది. అక్రమాలను నియంత్రించడంలో భాగంగా జిల్లా రిజిస్ట్రార్ల అధికారాలను కొంతమేర తగ్గించాలని భావిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లపై నిరంతరం నిఘా అవసరమని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి జిల్లాలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు అన్న విధానంలో అక్రమాలను నిరోధించడానికి ప్రభుత్వం ఆరునెలల కిందటే స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. కొన్ని స్వల్ప మార్పులవసరమని భావించి అమలు చేయకుండా ఉన్నతస్థాయిలో పెండింగ్‌లో ఉంచారు. కానీ ఎనీవేర్‌లో అక్రమాలు మితిమీరుతుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డీఐజీలు చొరవతీసుకుని ప్రభుత్వ మార్గదర్శకాలను అనధికారికంగా అమలు చేస్తున్నారు. అధికారికంగా ఉత్తర్వులు రాకపోవడంతో కొంత సందిగ్ధత కొనసాగుతున్నది. కూకట్‌పల్లితోపాటు పలుచోట్ల తాజాగా అక్రమాలు వెలుగుచూస్తుండటంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎనీవేర్‌పై తాజా మార్గదర్శకాలను రూపొందించి సోమవారం జీవో జారీ చేయాలని ఆదేశిచ్చారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనాతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎనీవేర్ అక్రమాల నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి ఇకపై అమలుపరుచనున్న నిబంధనలు, చేపట్టనున్న చర్యలు: # ఒక ప్రాంతంలోని స్థిరాస్తిని మరో ప్రాంతానికి చెందిన సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆ డాక్యుమెంట్‌ను 48 గంటల వరకు పెండింగ్‌లో ఉంచాలి. # 48 గంటలలో సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌తో పరిశీలించుకుని అది సరైనది అని నిర్ధారించుకున్న తర్వాతే డాక్యుమెంట్‌ను ఆమోదించాలి. ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో భూముల విలువను సరిగ్గా నిర్ధారించారా..? సదరు ఆస్తి నిషేధిత జాబితాలో ఉందా అనే విషయాలను నిశితంగా పరిశీలించాలి. సవ్యంగా లేకపోతే రద్దు చేయాలి. # డాక్యుమెంట్ సరిగ్గా లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తే సదరు అధికారిని సస్పెండ్ లేదా డిస్మిస్ చేయాలి. # సబ్ రిజిస్ట్రార్లు చేసే రిజిస్ట్రేషన్లను ఆడిట్ అధికారులు వెంటవెంటనే తనిఖీలు చేయాలి. # డీఐజీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను తరుచూ తనిఖీ చేయాలి. # జిల్లా రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాలను కొంతవరకు కుదించి కమిషనర్‌కు బదలాయించాలి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పునర్విచారణలు: ఎనీవేర్ రిజిస్ట్రేషన్లలో అక్రమాలపై ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలు చేపడుతున్నది. కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ హయాంలో జరిగిన వివాదాస్పద డాక్యుమెంట్లను రద్దుచేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అందించినట్లు సమాచారం. అలాగే 2007లోనే హుడాకు, తదనంతరం ఎల్ అండ్ టీ మెట్రోరైల్‌కు కేటాయించిన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌ను మియాపూర్ పోలీసులు విచారిస్తున్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లపై, ప్రత్యేకించి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను పునపరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలతోపాటు మరికొన్ని అంశాలపై డీఐజీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నది. ఎనీవేర్ విధానంలో ఎక్కువగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందులో ప్రభుత్వానికి నష్టం జరిగేలా వ్యవహరించిన సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీని వసూలు చేశారా లేదా అనే విషయంపై నిఘా పెట్టామని, ఆడిట్ రిజిస్ట్రార్లు విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుక్- 1, బుక్- 4లో జరిగిన రిజిస్ట్రేషన్లను ఎప్పటికప్పడు పర్యవేక్షించేందుకు ఓ ఉన్నతాధికారుల బృందాన్ని నియమిస్తున్నట్లు తెలిపారు.