కన్నుల పండుగగా లష్కర్ బోనాలు

SMTV Desk 2017-07-10 16:22:12  Lashkar, bones, as, a festival, of, eyes

హైదరాబాద్, జూలై 10 : అమ్మవారి ఆషాడ బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు వేలాదిగా మహిళలు బోనాలు సమర్పించారు. లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4.05 నిమిషాలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, తొలి బోనాన్ని సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ కవిత బోనం సమర్పించారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి’’ అని ఉజ్జయిని మహంకాళిని కోరుకున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ ఆవిష్కృతం కావాలని కోరుకున్నట్లు గవర్నర్‌ తెలిపారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. జాతీయ సమగ్రత, జాతీయ భావనను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మంత్రులు, శాసనమండలి ఛైర్మన్‌, శాసనసభాపతి మాట్లాడుతూ...రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మరింత శక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఎంపీలు నంది ఎల్లయ్య, మల్లారెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, భాజపా శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.