ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తాం : కన్నా లక్ష్మీనారాయణ

SMTV Desk 2018-05-26 13:17:41  Kanna Lakshminarayana, ap bjp president, guntur, bjp

గుంటూరు, మే 26 : ఏపీ బీజేపీలో కొత్త శకం ఆరంభమైంది. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్ లో ఎన్డీయే నాలుగేళ్ల విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా కన్నా పదవీబాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు బాధ్యతలను నూతన అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్ధ నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ మహిళా నేత పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ..." బీజేపీతో నాకు నాలుగేళ్ల అనుబంధం.. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉంది. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నాను. నాపై అపోహలు వద్దు. కార్యకర్తలతో కలిసి ఏపీలో బీజేపీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ సాగిస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతగానితనంతో కేంద్రంపై నిందలు వేస్తున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలి" అని వ్యాఖ్యానించారు.