బంగ్లా ఖాళీ చేయనంటున్న బీఎస్పీ అధినేత్రి...

SMTV Desk 2018-05-25 19:09:31  bsp head mayawati, mayawati about bunglaw, up former cm, supreme court

లఖ్‌నవూ, మే 25 : యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయనని అంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్యమంత్రులు ఇంకా ప్రభుత్వ భవనాల్లో ఉండటం నిర్హేతుకమని వారు వెంటనే ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయిన మాయావతి మాత్రం బంగ్లాను ఖాళీ చేయనని చెబుతున్నారు. ప్రస్తుతం మాయావతి ఉంటున్న బంగ్లాను రాజస్థాన్‌ శాండ్‌స్టోన్‌, పింక్‌ మార్బుల్‌తో నిర్మించారు. ఇందులో మొత్తం పది పడక గదులు ఉన్నాయి. అయితే ఈ బంగ్లాను తన గురువు, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీ రాంజీ కట్టించారని ఆయన జ్ఞాపకార్థంగా దానిని ఖాళీ చేయదలచుకోలేదని అంటున్నారు. ఈ మేరకు ఐదు పేజీల లేఖతో పాటు.. బంగ్లాకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలతో మాయావతి సహచరుడు సతీశ్‌ చంద్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మధ్యాహ్నం కలిశారు. ఆ లేఖలో 2011లో తాను యూపీ ముఖ్యమంత్రిని అయినప్పుడు తనకు ఆ బంగ్లాను కేటాయించారని అదే ఏడాదిలో జనవరి 13న ఆ బంగ్లాను కాన్షీ రామ్‌ స్మారక భవనంగా ప్రకటించారని పేర్కొన్నారు. మాయావతి ఈ బంగ్లాలో కేవలం రెండు గదుల్లోనే ఉంటున్నారని ఆమె బతికున్నంతవరకూ ఈ భవనంలో ఉండే హక్కుందని అప్పట్లో ప్రభుత్వం అనుమతించినట్లు పత్రాల్లో రాసుంది. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ... " 2011లో ఈ బంగ్లాను మాయావతికి కేటాయించారు. కానీ, మాయావతి కేవలం రెండు గదుల్లోనే ఉంటుండటంతో యూపీ ప్రభుత్వం ఈ బంగ్లాను కాన్షీ రామ్‌ మెమోరియల్‌గా పరిగణించింది. మిగతా 8 గదుల్లో కాన్షీ రామ్‌కు సంబంధించిన పుస్తకాలతో గ్రంథాలయాన్ని రూపొందించింది" అని పేర్కొన్నారు.