అనుమానిత వ్యక్తిపై దాడిచేసిన తొమ్మిది మంది అరెస్ట్..

SMTV Desk 2018-05-24 18:08:39  kidnaper bengalore, social media fake news, bengalore police, karnataka

బెంగళూరు, మే 24: ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు పలువురి ప్రాణాలు మీదకు తెస్తున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని వదంతులతో ఆయా గ్రామాల్లో ప్రజలు అనుమానిత వ్యక్తులకు దేహశుద్ధి చేస్తున్నారు. తాజాగా బెంగుళూరులో ఒక వ్యక్తిని పోలీసులు కాపాడారు. చిన్న పిల్లలను అపహరణ చేస్తున్నారన్న అనుమానంతో రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తిని చిత్రహింసలుకు గురి చేసిన తొమ్మిది మందిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్ల ఉన్నారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. కిడ్నాప్‌ చేసే బృందం తిరుగుతుందంటూ వాట్సప్‌లో ఎక్కువగా వదంతులు వెలువడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో తిరుగుతున్న కలురామ్‌ అనే వ్యక్తిని కిడ్నాపర్‌గా భావించారు. దీంతో వారు అతనిని పట్టుకొని తాడుతో కాళ్లను కట్టి, రోడ్డుపై ఈడ్చి, కర్రలతో కొట్టారని, తాము అతనిని రక్షించి, ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అతను అక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. సీసీ టీవీ పుటేజ్‌ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు అధికారి పేర్కొన్నారు.