ఔటా..!..నాటౌటా..! అయితే ఎలా..?

SMTV Desk 2018-05-24 15:05:27  icc vedio viral, International Cricket Council (ICC), out or not out vedio, dubai

దుబాయ్, మే 24 : సాధారణంగా గల్లీలో క్రికెట్ ఆడేటప్పుడు కొన్ని ఔట్లు చాలా వింతగా అనిపిస్తాయి. ఔటా..! నాటౌటా..! అని చాలా మంది పేచికి దిగడం మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఒక ఔట్ పై హజ్మా అనే వ్యక్తి న్యాయం కోసం ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)ను ఆశ్రయించాడు. ఈ మేరకు మ్యాచ్‌ సమయంలో రికార్డు చేసిన వీడియోను ఐసీసీకు ట్వీట్‌ చేసి న్యాయం చెప్పాలని కోరాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని వీడియోపై స్పందించిన ఐసీసీ నిబంధన 32 (1) ప్రకారం బ్యాట్స్‌మన్‌ ఔట్‌ అని తేల్చింది. ఈ మేరకు రీట్వీట్‌ కూడా చేసింది . హంజా అనే పేరుగల అభిమాని మంగళవారం ఐసీసీకి ఓ వీడియోను ట్యాగ్‌ చేశాడు. పలువురు వ్యక్తులు క్రికెట్‌ ఆడుతూ కనిపించిన వీడియో ఇది. అయితే ఇందులో బౌలర్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్‌ బాగానే ఎదుర్కొన్నాడు. కానీ, ఆ బంతి కొంత దూరం వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి నేరుగా వికెట్లను తాకింది. బంతిని అడ్డుకునేందుకు బ్యాట్స్‌మెన్‌ ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. దీంతో ఒక్కసారిగా షాకైన బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు వెళ్లేందుకు మొదట నిరాకరించాడు. కొద్దిసేపటి తర్వాత ఔటని ఒప్పుకుని వెనుదిరగాడు. ఈ వీడియోలో బ్యాట్స్‌మెన్‌ ఏ నిబంధన ప్రకారం ఔటయ్యాడో చెప్పాలంటూ హంజా ఐసీసీను అడిగాడు. దీనికి ఐసీసీ "బ్యాట్స్‌మెన్‌ దురదృష్టం. 32.1 నిబంధన ప్రకారం ఇది ఔట్‌" అని బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఐసీసీ చేసిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ దాదాపు 2 మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు. మరి మీరూ ఈ వీడియోపై లుక్కేయండి.