మన పిలుపు.. కావాలి వారికి మేలుకొలుపు..

SMTV Desk 2018-05-23 11:29:01  ap cm, chandrababu naidu, dharmaporata deekshs, vishakhapatnam.

విశాఖ, మే 23 : ధర్మపోరాటం ద్వారా మన నిరసన ఢిల్లీ నాయకులకు తాకాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. మన నిరసన పిలుపు కేంద్రంలోని అధికారులకు మేలుకొలుపు కల్పించేలా ప్రజలు కలిసి ముందుకు రావాలన్నారు. ఈ కష్ట సమయంలో తెలుగుజాతి అంతా ఒక్కటి కావాలి. రాష్ట్రం కోసం యువత, ప్రజానీకం అంతా కలిసి సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో భారీ జనసందోహం మధ్య నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "రాష్ట్రంలో ఓ అవినీతి పార్టీ.. మరో కీలుబొమ్మ పార్టీ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కీ ఇస్తుంటే.. వాళ్లు ఇక్కడ ఆడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి దాసోహం అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంపై పోరాడుతుంటే రాష్ట్రానికి సహకరించాలా..? అన్యాయం చేసిన కేంద్రానికి సహకరించాలా..? మీరే చెప్పండి" అని కార్యకర్తలను అడిగారు. తెదేపా కార్యకర్తలు.. పార్టీపై నమ్మకం పెట్టుకున్న ప్రజలు తలచుకుంటే భాజపా అడ్రస్‌ లేకుండా పోతుందని హెచ్చరించారు. సభలో రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, కేంద్ర మాజీ మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు నారా లోకేష్‌, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్‌లు తదితరులు పాల్గొన్నారు.