వారం రోజుల జీఎస్టీ

SMTV Desk 2017-07-09 18:06:48  Weekly, GST

న్యూఢిల్లీ, జూలై 09 : జీఎస్‌టి అమల్లోకి వచ్చి వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో కొత్త చట్టం, కొత్త రేట్ల అమలుపై అనుమానాలు, ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ప్రతినిధులు, ఆర్థిక మంత్రి వీటిని నివృత్తి చేస్తూ జీఎస్‌టి అమలును ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని రంగాలపై జీఎస్‌టి ప్రభావం కనిపిస్తోంది. కొన్ని ఉత్పత్తులపై ధరలు తగ్గిన, కొన్ని సర్వీసుల ధరలు భగ్గుమంటున్నాయి. ఏడు రోజుల జీఎస్‌టి పరిణామాలపై క్లుప్తంగా ఒక సమీక్ష. # ఎంఆర్‌పి వివాదం: జూలై 1 నుంచి మార్కెట్లో విక్రయించే అన్ని సరుకులకూ జీఎస్‌టి రేట్లే వర్తిస్తాయని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా వర్తకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జీఎస్‌టి కారణంగా తగ్గాల్సిన సరుకుల ధరలు ఇంకా తగ్గడం లేదు. పలు సర్వీసులకు మాత్రం రేట్లను వెంటనే పెంచేశారు. మార్కెట్లో చలామణిలో ఉన్న వస్తువులన్నింటిపైనా పాతధరలతో పాటు కొత్త ధరలు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతను ఉత్పత్తి సంస్థలపై పెట్టారు. లేదంటే జరిమానా, జైలు శిక్షలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించినా దీని ప్రభావం కనిపించడంలేదు. జీఎస్‌టి వల్ల తగ్గుముఖం పట్టిన అనేక ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులను ఇప్పటికీ పాత ధరలకే కొనుగోలు చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, టేక్‌ అవేల్లో 18 శాతం సర్వీసు టాక్స్‌ తొలిరోజు నుంచే మొదలుపెట్టారు. # రూ. 20 లక్షలలోపు ఉన్నా పన్ను : వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షలలోపు ఉన్న సంస్థలను జీఎస్‌టి నుంచి ప్రభుత్వం మినహాయించింది. లక్షల సంఖ్యలో ఉన్న చిన్న సంస్థలు, ట్రేడర్లకు ఈ రాయితీ ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే రూ.20 లక్షలలోపు టర్నోవర్‌ ఉన్న సంస్థలైనా సరే ఇరుగుపొరుగు రాష్ట్రాలకు సరుకులను ఎగుమతి చేస్తే మాత్రం జీఎస్‌టి కింద నమోదు చేసుకోవాల్సిందే. 15 మంది నోడల్‌ # అధికారుల నియామకం : ప్రభుత్వం దేశవ్యాప్తంగా15 మంది నోడల్‌ అధికారులను నియమించింది. జీఎస్‌టి అమల్లో ఎదురవుతున్న ప్రాధమిక అవరోధాలను చక్కబెట్టడానికి ఈ నోడల్‌ ఆఫీసర్లను పర్యవేక్షణలోకి తెస్తూ 15 మంది సభ్యులతో కార్యదర్శుల స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. # పాఠ్యపుస్తకాల్లోకి జీఎస్‌టి : జీఎస్‌టీని సీఎలో ఒక సబ్జెక్ట్‌గా చేరుస్తున్నట్టు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. పలు ప్రాంతాల్లో నాలుగు నుంచి వారం రోజుల కోర్సులు, వర్క్‌షాప్‌లను ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ బికామ్‌, బిఎ పాఠ్యాంశాల్లో జీఎస్‌టిని చేర్చనున్నట్టు ప్రకటించింది. # ఆటోమొబైల్‌ ధరలు తగ్గుతున్నాయ్‌ : జీఎస్‌టి అమలుతో ద్విచక్ర వాహనాలు, కార్ల వాహనాల ధరలను ఉత్పత్తి సంస్థలు తగ్గిస్తున్నాయి. తగ్గించిన ధరలకే వాహనాలను విక్రయిస్తున్నట్టుగా కంపెనీలు చెబుతున్నాయి. # ద్విచక్రవాహనాలు : హీరో మోటాకార్ప్‌ కొన్ని పాపులర్‌ మోడల్స్‌పై రూ.1,800 వరకు తగ్గించింది., హైఎండ్‌ మోడల్స్‌లో 4,000 రూపాయల వరకు తగ్గించింది. టీవీఎస్‌ ప్రారంభ మోడల్స్‌, మధ్యతరహా మోడల్స్‌పై రూ.350 నుంచి రూ.1,500 వరకు తగ్గించింది. ప్రీమియం విభాగంలో తగ్గింపు 4,150 రూపాయల వరకు ఉంది. బజాజ్‌ ఆటో కూడా ధరల తగ్గింపును ప్రకటించింది. # ఇక కార్ల విభాగంలో : మారుతి సుజుకీ, టయోటా కిర్లోస్కర్‌, జెఎల్‌ఆర్‌, బిఎండబ్ల్యు,.. సంస్థలు మోడల్స్‌ను బట్టి ధరలను 2,300 నుంచి 2 లక్షల రూపాయల వరకు తగ్గించాయి. హ్యుండయ్‌ కార్ల ధరలు 5.9 శాతం మేర తగ్గాయి. టాటా మోటార్స్‌ 8.2 శాతం వరకు తగ్గించింది. మారుతి చిన్న కార్ల ధరలను 3 శాతం వరకు తగ్గించారు. ఈ విధంగా ఆటోమొబైల్‌ రంగంలో జీఎస్‌టి ప్రభావం ఉంది.