వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తాం : పవన్

SMTV Desk 2018-05-20 19:11:48  pawan kalyan, srikakulam janasena, icchapuram, andhrapradesh

ఇచ్ఛాపురం, మే 20 : 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసమే తెదేపాకు మద్దతు ఇచ్చానని.. కానీ, ఏళ్లు గడుస్తున్నా ప్రత్యేకహోదా రాలేదని చెప్పారు. ఆదివారం ఇచ్ఛాపురంలో జరిగిన జనసేన పోరాట యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."2019లో సరికొత్త ప్రజా ప్రభుత్వం వస్తుంది. చిత్తశుద్ధితో కష్టపడదాం. పార్టీని బలోపేతం చేద్దాం. అధికారం అనేది ఒక వర్గానికో కొద్ది మంది కుటుంబ సభ్యులకో పరిమితం చేసేది కాదు. తెలుగుదేశం పార్టీ గంగతల్లి బిడ్డలకు, అడవితల్లి బిడ్డలకు గొడవ పెట్టింది. తెలుగుదేశం విధానాలు కులాలను విడదీసేలా ఉన్నాయి. అన్ని కులాలను ఐక్యం చేసే విధానం మాది. ప్రత్యేకహోదాపై మొట్టమొదట భాజపాను నిలదీసింది జనసేన పార్టీ. 2014 ఎన్నికల్లో పోటీ చేయనుందుకు క్షమించమని ప్రజలను అడుగుతున్నా. భాజపాకు భయపడుతున్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. ఎందుకు భయపడుతున్నారో లోగుట్టు పెరుమాళ్‌కే తెలుసు. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తాం. ప్రధాని మోదీ మాటలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విశ్వాసం కోల్పోయారు" అని పవన్ వ్యాఖ్యానించారు. "నేను గెలుస్తానో లేదో తెలియదు కానీ, ప్రజలను మాత్రం మోసం చేయను. మా మీద కేసులు పెట్టినా, వేధించినా ఊరుకునే వ్యక్తులం మాత్రం కాదు. గుర్తుంచుకోండి. మేము న్యాయంగా వెళతాం. మీరు బతకండి.. మమ్మల్ని బతకనివ్వండి. కాదు కూడదు అణగదొక్కుతామంటే ఉవ్వెతున్న సునామీ కెరటంలా పైకి లేస్తాం. బెదిరిస్తే చేతులు కట్టుకొని కూర్చొనే వ్యక్తులం కాదు.. ఎదురుదాడి చేస్తాం. మేము ప్రజా పక్షం అందుకే.. వైకాపా, తెదేపా, భాజపా విమర్శిస్తున్నాయి. మేము ప్రజల కోసం పనిచేసే జన సైనికులం" అని పవన్ అన్నారు.