తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

SMTV Desk 2018-05-19 13:38:30  ts eamcet results, ts eamcet, kadiyam srihari, hyderabad

హైదరాబాద్‌, మే 19 : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. సచివాలయంలోని డీ బ‍్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1,36,311 మంది, అగ్రికల్చర్‌ పరీక్షకు 66,857 మంది హాజరయ్యారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, ఎంసెట్‌ వ్యవసాయం, ఫార్మాలో 90.72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఫలితాలను శనివారం సాయంత్రం 4 గంటలకు వెల్లడి చేస్తామని అధికారులు నిన్న వెల్లడించారు. ఫలితాల విడుదల సమయంలో స్వల్ప మార్పులు చేసినట్లు ఈరోజు ప్రకటించారు. ఫలితాలతో పాటు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను విడుదల చేశారు. సీబీఎస్‌ఈ ఫలితాలు రాలేని వారికి, ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ర్యాంక్‌లు ఇవ్వలేదని తెలిపారు. కాగా తెలంగాణ ఎంసెట్‌ - 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్‌ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్‌ ఆధారితంగా ఎంసెట్‌ పరీక్షలను నిర్వహించారు. మే 25 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సిలింగ్‌ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్‌ ఉంటుందని, జులై 16 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ఆరంభం కానున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.