భాగ్యనగరంలో జోరువాన

SMTV Desk 2018-05-17 18:27:35  wind stromhyderabad, rain fall in hyderabad, windstrom, massive rain

హైదరాబాద్‌, మే 17 : ఆకాశమంతా మేఘావృతమై చీకట్లు కమ్ముకొని కొద్దిసేపట్లోనే నగరమంతా భీకర గాలులతో వండగండ్లతో కూడిన భారీ వర్షం నగరాన్ని వణికించింది. అప్పటివరకు బాగానే ఉన్న వాతావరణం సాయంత్రం నాలుగు గంటలు ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు.. ఇంతలోపే హోరున ఈదురు గాలులతో వర్ష బీభత్సం సృష్టించింది. దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో భాగ్యనగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, మెహదీపట్నం, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లితో పాటు రాం నగర్, ఓయూ, అబిడ్స్‌, కోఠి, బషీర్‌బాగ్‌, సుల్తాన్‌బజార్‌, సికింద్రాబాద్, అల్వాల్‌, తిరుమలగిరి, మాదాపూర్‌, గచ్చిబౌలి, ఈసీఐఎల్‌, సైనిక్‌పురి, కుషాయిగూడ, నాచారం, దమ్మాయిగూడతో పాటు పలు ప్రాంతాల్లో భీకరగాలులతో కుండబోత వర్షం కురుస్తోంది. వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రానున్న మూడు రోజుల్లో గ్రేటర్ పరిధిలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఇదివరకే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.