గవర్నర్లు కీలుబొమ్మలుగా మారారు : ఎంకే స్టాలిన్‌

SMTV Desk 2018-05-17 14:51:56  DMK leader MK Stalin, mk stalin about karnataka, stalin tweet, chennai

చెన్నై, మే 17: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. "గతంలో తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లే, ఇప్పుడు ప్రధాని మోదీ కర్నాటకలోనూ రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కింది. అన్ని రాష్ట్రాల గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ఇది అందరికి తెలిసిందే. కానీ, ఇప్పుడు వాజుభాయ్‌ వాలా తీసుకున్న నిర్ణయాన్ని డీఎంకే తీవ్రంగా ఖండిస్తోంది" అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఇక మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు స్టాలిన్‌ వెల్లడించారు. అంతకు ముందు ఆయన తన ట్వీటర్‌లో ఆయన కర్ణాటక పరిణామాలపై వరుస ట్వీట్లు చేశారు. "కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వనించారు. ఏకపక్షంగా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం పునాదులను నాశనం చేసేదిగా, ముఖ్యంగా బేరసారాలను ప్రొత్సహించేదిగా ఉంది. తమిళనాడులోనూ అవినీతి అన్నాడీఎంకేను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు" అని స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.