నాది రోజుకో జన్మ.. : వర్మ

SMTV Desk 2018-05-16 16:27:08  ram gopal varma, officer movie, varma interview

హైదరాబాద్, మే 16 : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏపని చేసిన సంచలనమే. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన సినిమాలు తీస్తే అవి పరాజయాలైనా సరే అతనితో సినిమాలు తీయడానికి నిర్మాతలు వరుస కడుతుంటారు. ఇటీవల వర్మ నాగార్జునతో తీసిన "ఆఫీసర్‌" త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వర్మ ఓ ఇంటర్వ్యూలో.. మనిషి బ్రతకడానికి ఏదో ఒక ఆశ అవసరం.. మరి మీలో అలాంటి ఆశలేం కనిపించవేం? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. మనిషి బతకడానికి ఒక లక్ష్యం కావల్సిందే. నేనేం చేయాలని ఆలోచించినప్పుడు మనిషికి ఒక లక్ష్యం వస్తుంది. అది ఒకడికి డబ్బే కావచ్చు.. మరొకరికి ఏదైనా ఒక కళ కావచ్చు.. ఇంకొకరికి మిలటరీలో చేరడం, అలా మరొకరికి మరొకటి అంటూ తెలిపారు. ఇక నా లక్ష్యం అంటారా? ఆ మధ్య నాకు ఒకతను ప్రశ్న వేశాడు.. ఇంత తెలివైన మీరు ఫ్లాప్ సినిమాలెలా తీస్తారు? అని అడిగాడు. అప్పడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే.. "మొదట నేను ఫిలిం మేకర్ అనుకోవడం నీ తప్పు. నేను సినిమాలు తీస్తాను కానీ మేకర్‌ని కాను" అంటూ జవాబిచ్చారు. అంతేకాదు హిట్ సినిమా తీయాలనో, నంది అవార్డో, లేదంటే జాతీయ అవార్డు తీసుకోవాలనో నేను పరిశ్రమలోకి రాలేదు. నా ఉద్దేశంలో నా సక్సెస్ ఏంటంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ఇష్టం వచ్చినట్టు బతకడం. నా దృష్టిలో నేను పొద్దున పుడతా, రాత్రి చచ్చిపోతా. రోజుకో జన్మ. ఏ రోజుకారోజు బతికినపుడు నా లక్ష్యాలు మారుతుంటాయి" అని చెప్పుకొచ్చారు.