కేసీఆర్ అసలు సీక్రెట్

SMTV Desk 2017-07-08 17:45:28  

న్యూఢిల్లీ, జూలై 8 : రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా అమరణ దీక్షతో తెలంగాణను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్..ఎప్పుడో జరగాల్సిన ఆపరేషన్ మాత్రం వాయిదా వేస్తూ వస్తున్నారు. దీనికి గల కారణాలు తెలిస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం వేస్తుంది. గత కొన్ని రోజులుగా కేసీఆర్ కుడి కంటి పై శుక్లం ఏర్పడటంలో దాన్ని తొలగించడానికి చిన్నపాటి లేజర్ ట్రీట్మెంట్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఒత్తిడిచే ఆపరేషన్ కు ఒప్పుకుని ఇదే పనిపై రెండుసార్లు ఢిల్లీకి వచ్చిన ఆయన ఏదో ఒక కారణంతో ఆపరేషన్ ను వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల కూడా పర్యటన కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు అమెరికా నుంచి రావాల్సిన డాక్టర్ సకాలంలో రాకపోవడంతో మరోసారి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటానంటూ తిరిగి హైదరాబాద్ వచ్చేసారు. తిరిగి డాక్టర్ అందుబాటులోకి రాగానే సీఎంకు సమాచారం అందించారు. దీంతో గత నెల కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఢిల్లీకి వెళ్లారు. వెంటనే డాక్టర్లు ఆయన కంట్లో చుక్కల మందు వేసి ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ నామినేషన్ అనంతరం ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పి మళ్లీ వాయిదా వేశారు. నామినేషన్ తరువాత కూడ మరో సాకు చెప్పడం మొదలు పెట్టారు. ఆపరేషన్ చేస్తే కనీసం వారం రోజులైన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో కోవింద్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వస్తున్నందున ఆయన కంటే ముందు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందంటూ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి తిరిగి ప్రయాణమయ్యారు. ఇన్ని వాయిదాలు పడుతూ వస్తున్న కేసీఆర్ ఆపరేషన్ కు వేరొక కారణం ఉందటా.. ఈ కారణాన్ని ఆయనే స్వయంగా తన పార్టీ నేతలతో పంచుకున్నారు. అసలు కేసీఆర్ కు సూది మందంటేనే భయమట, అందుకే ఆపరేషన్ ను వాయిదా వేశారట. ఆపరేషన్ కి బదులు వీలైనంత మేరకు టాబ్లెట్స్ తోనే నయం చేసుకుంటానని చెప్పడంతో ఎంపీలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మీరే ఒక్క సూది మందుకు భయపడడం ఏంటీ? అంటూ ఎంపీలు ప్రశ్నలు సంధించారు. ఈ ఆపరేషన్ వాయిదా విషయాన్ని ఎవరితో చెప్పకుండా గుట్టుగా ఉంచండంటూ ఇంతవరకు మా ఇంట్లో వారికి కూడా ఈ విషయం తెలియదు. మీరు గనుక చెబితే బలవంతంగా ఆపరేషన్ చేయిస్తారు. అని సీఎం కేసీఆర్ చెప్పడంతో అక్కడున్న నేతలందరూ ఒక్కసారిగా నవ్వేశారు.