పంజాబ్ కు ఆ తేది అచ్చి రాలేదంటా..!

SMTV Desk 2018-05-15 13:10:07  kings X1 punjab, ipl, kings X1 punjab, rising pune super giants

ఇండోర్, మే 15 ‌: ఐపీఎల్ లో కింగ్స్ X1 పంజాబ్ జట్టు స్టార్ ఆటగాళ్లు ఉన్న ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పరిస్థితి. టోర్నీలో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఉమేష్ యాదవ్ తో పాటు మిగతా బౌలర్ల ధాటికి ఆ జట్టు కేవలం 15.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. అయితే మే 14వ తేదీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు కలిసిరాలేదని అంటున్నాయి ఆ జట్టు వర్గాలు. ఎందుకంటే గత ఏడాది, ఈ ఏడాది మే 14వ తేదీన ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్‌ ఘోర పరాజయాన్ని నమోదు చేసుకుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ స్వల్ప స్కోర్లకే పంజాబ్‌ చాపచుట్టేసింది. 2017 మే 14న పంజాబ్‌ ఆడిన మ్యాచ్‌లో ఇలాగే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఆ ఏడాది రైజింగ్‌ పూణె సూపర్‌జెయింట్స్‌తో పంజాబ్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ X1 15.3 ఓవర్లలో కేవలం 73 పరుగులు చేసింది. అప్పుడు ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌ డకౌట్‌ అవ్వగా, మరో ఓపెనర్‌ సాహా 13 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ (22పరుగులు 26 బంతుల్లో)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. నిన్నటి మ్యాచ్‌లో అరోన్‌ ఫించ్‌దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 23 బంతుల్లో 26 పరుగులు చేశాడు. దీంతో మే 14వ తేదీ పంజాబ్‌కు కలిసిరాదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరాజయంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది.