క్రీడాకారులకు శుభవార్త.. విద్య, ఉద్యోగాల్లో 2% రిజర్వేషన్...

SMTV Desk 2018-05-15 12:43:03  soprts quota, sports minister padmarao, cm kcr.

హైదరాబాద్, మే 15 : విద్యా ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లను వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ఎయిడెడ్ సంస్థలలోని ప్రత్యక్ష నియామాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంటూ జీవో నెం.5 జారీ చేసింది. ప్రస్తుతం పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో 2% రిజర్వేషన్లు ఉండగా, తెలంగాణ మూడో రాష్ట్రంగా దీన్ని అమలు చేయనుండడం విశేషం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు ఈ నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేశామని క్రీడల శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో ఆయా శాఖల కార్యదర్శి, ఛైర్మన్‌ లతో ఆయన ఉత్తర్వుల ప్రతులను విడుదల చేశారు. ఇటీవల కామన్వెల్త్‌కు వెళ్లిన క్రీడాకారులను అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడాకారులకు 2% రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారని గుర్తు చేస్తూ.. ఆయన సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ల అమలుకు సన్నాహాలు చేశామని తెలిపారు. క్రీడా రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్ల మాదిరిగా సమాంతరంగా అమలవుతాయని.. ఈ రోస్టర్‌ ప్రకారం 48, 98 పాయింట్లను దీనికి కేటాయించారని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. అనగా ఈ విధానంలో ప్రతి వంద పోస్టుల భర్తీలో 48వ, 98వ పోస్టులు క్రీడాకారులకు చెందుతాయి. ఈ రిజర్వేషన్లను మొత్తం 29 క్రీడలకు వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆ క్రీడలు ఏంటంటే.. ఫుట్‌బాల్‌, హాకీ, వాలీబాల్‌, హ్యాండ్‌బ్యాల్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, టేబుల్‌టెన్నిస్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, కబడ్డీ, అథ్లెటిక్స్‌, ఈత, జిమ్నాస్టిక్స్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, సైక్లింగ్‌, త్రోయింగ్‌, షూటింగ్‌, ఫెన్సింగ్‌, రోలర్‌ స్కేటింగ్‌, సెయిలింగ్‌/ యాచింగ్‌, ఆర్చరీ, క్రికెట్‌, చెస్‌, ఖోఖో, జూడో, తైక్వాండో, సాఫ్ట్‌బాల్‌, బాడీ బిల్డింగ్‌.