అరుణ్‌జైట్లీకి కిడ్నీ మార్పిడి విజయవంతం : ఎయిమ్స్

SMTV Desk 2018-05-14 17:24:17  Arun Jaitley, kidney transplant Arun Jaitley, aiims, delhi

ఢిల్లీ, మే 14 : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) చెప్పారు. 65ఏళ్ల జైట్లీ గత కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావటంతో ఆయనకు తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేశారు. జైట్లీ శనివారం ఎయిమ్స్‌లో చేరారు. ఈరోజు ఉదయం జైట్లీకి శస్త్రచికిత్స చేశారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సోదరుడు, అపోలో ఆస్పత్రికి చెందిన నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ సందీప్‌ గులేరియా శస్త్రచికిత్స చేసిన వైద్యుల బృందంలో ఉన్నారు. ఆపరేషన్‌ నేపథ్యంలో జైట్లీ లండన్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. వచ్చే వారంలో జైట్లీ లండన్‌లో భారత్‌- యూకే ఎకనమిక్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ డైలాగ్‌కు హాజరుకావాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా పర్యటనకు వెళ్లడం లేదు. ఏప్రిల్‌ ఆరో తేదీనే జైట్లీ తన అనారోగ్యం గురించి ట్విటర్ ద్వారా వెల్లడించారు. మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. జైట్లీకి కొన్నేళ్ల క్రితం గుండె సంబంధిత సర్జరీ కూడా అయింది.