ఓడారు.. కానీ మనసులు గెలిచారు

SMTV Desk 2018-05-12 20:34:45  kkr vs kings x1 punjab, ipl, kl rahul, kkr

ఇండోర్‌, మే 12 : చేధించడానికి ఎదుట భారీ లక్ష్యం.. అయిన పంజాబ్ జట్టు వెనక్కి తగ్గలేదు. పోరాట పటిమ చూపి పోరాడింది. కానీ చివరకు ఓడిపోయింది. కానీ అభిమానుల మనసులను గెలుచుకొంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా కింగ్స్ X1 పంజాబ్- కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టులో సునిల్‌ నరైన్‌ (75; 36 బంతుల్లో 9÷4, 4×6), దినేశ్‌ కార్తీక్‌ (50; 23 బంతుల్లో 5×4, 3×6) రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా చెలరేగడంతో 245 పరుగులు సాధించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టులో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (21) పరుగులతో పెవిలియన్ కు చేరాడు. మరో వైపు లోకేష్ రాహుల్ (66; 29 బంతుల్లో 2×4, 7×6), రవిచంద్రన్‌ అశ్విన్‌ (45; 22 బంతుల్లో 4×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆరోన్ ఫించ్ కూడా (34; 20 బంతుల్లో 3×4) ఫర్వాలేదనిపించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్‌ మూడు వికెట్లు సాధించగా, నరైన్‌, ప్రసిధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌, సీర్లెస్‌లు తలో వికెట్‌ తీశారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సునీల్ నరైన్ కు దక్కింది.