సివిల్స్ టాపర్.. ఫెయిల్ అయిన సివిల్ ఇంజినీర్..

SMTV Desk 2018-05-11 18:39:07  ram gopal varma, civils topper akshay kumar yadavalli, selfee.

హైదరాబాద్, మే 11 : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తన మాటలతో, పోస్టులతో కొన్ని సంచలనాలకు దారి తీస్తుంటారు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో.. ఎవరిని విమర్శిస్తారో ఎవరికి అర్థం కాదు. కొంతమంది ఆయనను అభిమానిస్తారు. కొంతమంది ఆయనను విమర్శిస్తూ ఉంటారు. తాజాగా.. "నేను రామ్ గోపాల్ వర్మ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఆయనంటే నాకు చాలా ఇష్టం. రోజు ఆయన వీడియోలు చూడకుండా నిద్రపోను" అంటూ సివిల్స్ టాపర్.. తెలంగాణ కుర్రాడు యడవల్లి అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. "నిజానికి వర్మ లేకపోతే నా లైఫ్ లేదంటూ" అక్షయ్ తన అభిమానాన్ని వెల్లడించాడు. ఇదంతా తెలుసుకున్న వర్మ.. తనను విపరీతంగా అభిమానించే సివిల్స్ టాపర్ ను కలిశారు. ఎవరైనా సెలబ్రిటీ ఎదురైనపుడు సెల్ఫీలు తీసుకోవాడానికి ఆరాటపడుతుంటారు. కాని ఇక్కడ సీన్ రివర్స్ చేస్తూ.. సివిల్స్ టాపర్ అక్షయ్ తో వర్మ తానే సెల్ఫీ తీసుకొని దాన్ని ట్వీట్ చేశారు. అంతేకాకుండా "సివిల్స్ టాపర్.. ఫెయిల్ అయిన సివిల్ ఇంజినీర్" అంటూ కామెంట్ పెట్టి మరీ పోస్ట్ చేశారు. తనను ప్రత్యేకంగా కలిసి ఒక సేల్ఫీ దిగాలని వర్మ స్వయంగా కోరడంతో అక్షయ్ ఎంతగానో మురిసిపోయారట.