ఓట్లువేసేది.. తన్నించుకోవడం కోసమా.?

SMTV Desk 2017-05-29 14:25:52  mudragadam,manifesto impliment,

కాకినాడ, మే 29 : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. 9/4/2017న ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు చిత్తు కాగితాలుగా మారుతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.ఎస్ ఖేహర్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని లేఖలో పేర్కొన్నారు. లేఖలోని కొన్ని ముఖ్యాంశాలు.. రాజకీయ పార్టీలు అధికారం చేపట్టడం కోసం అనేక హామీలు అమాయక గౌరవ ప్రజానీకానికి ఇచ్చి నమ్మించి ఓట్లు వేయించుకుంటున్నారు.. హామీలు నెరవేర్చమని అడిగితే పోలీసుల వలయంలో పరిపాలన చేస్తూ ప్రజలను పోలీసులతో కొట్టించడం, తిట్టించడం, తన్నించడం, అక్రమ కేసులు పెట్టించడం లాంటివి చేసి భయంకరమైన పాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఓట్లువేయడం, తన్నించుకోవడం కోసమా అనిపిస్తోంది.? ఇప్పటి పాలకులు ఎప్పుడో గతించిన రాచరిక వ్యవస్థను గుర్తు చేస్తున్నారంటూ ముద్రగడ దుయ్యబట్టారు. సమాజంలో రూపాయి ఖర్చులేని ఎన్నికలు జరపడానికి ఏ రాజకీయ నాయకుడు కృషి లేదు సరిగదా.. వ్యవస్థను మరింత భ్రష్టు పట్టిస్తున్నారని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో కోట్లాది రూపాయిలు విచ్చలవిడిగా ఖర్చు, లారీలతో లిక్కరు ఇవ్వగలిగిన వారే ఎన్నికల్లో పోటీ చేయాలి గానీ.. అవి లేనివారు పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. అవినీతి, కేన్సర్ కంటే ప్రమాదం అని దేశంలో ఎంతోమంది గౌరవ మేధావులు చెబుతున్న విషయాన్ని లేఖలో ముద్రగడ వివరించారు. ఎన్నికల సమయంలో పార్టీలిచ్చిన హామీలను అధికారంలోకి రాగానే 2 సంవత్సరాల్లోపే పక్కాగా అమలు చేయాలనే గట్టి నిబంధన విధిస్తే తప్ప నాయకుల తోక జాడింపులు జరగవని ముద్రగడ తెలిపారు. హామీలు అమలు చేయని పక్షంలో నాయకులపై కఠిన చర్యలు తీసుకోవడం కోసం చట్టాల్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇప్పటి రాజకీయ వ్యవస్థలో ఇచ్చిన హామీలు పదవికాలం ముగింపుకు వచ్చే సమయానికి తూతూ మంత్రంగా చేసి ‘మమ’ అనేయడంతోనే.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి చేశామని గొప్పలు చెప్పేవారు ఎక్కువయ్యారు.. వారిని కట్టడి చేయాల్సిన అవసరం మీపైన ఎంతైనా ఉందని ప్రధాని మోదీకి.. ముద్రగడ లేఖ రూపంలో విన్నవించారు.