ఎబోలా ఎటాక్... 17మంది మృతి

SMTV Desk 2018-05-09 16:17:57  ebola attack, ebola in Democratic Republic of Congo, ebola virus, WHO

కిన్‌షాసా, మే 9: ప్రపంచాన్ని వణికించిన ఎబోలా మహమ్మారి మరోసారి బయటపడింది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో దేశంలో ఎబోలాతో 17 మంది మరణించారు. ఎబోలా వైరస్ వల్లే మరణాలు సంభవించాయని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. తమ దేశంలో మరోసారి ఎబోలా వైరస్‌ వ్యాపించిందని, దీంతో దేశంలో అంతర్గత ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించామని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. బికోరో పట్టణం సమీపంలోని గ్రామంలో దాదాపు 21 మంది కొద్ది రోజుల క్రితం ఎబోలా వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎబోలా వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించగా వారిలో 17 మంది మృత్యువాత పడ్డారు.ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్‌ బయటపడడం ఇది తొమ్మిదోసారి. దాదాపు ఏడాది క్రితమే ఎబోలా కారణంగా కాంగోలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 1970లో మొదటిసారి ఎబోలా వైరస్‌ ను గుర్తించారు. రెండేళ్ల క్రితం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌ తీవ్రంగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగించింది.