పిల్లలో ఒత్తిడికి బై..బై..

SMTV Desk 2018-05-08 13:17:19  children depression, children depression tips, hyderabad, school home works

హైదరాబాద్, మే 8 : ఒత్తిడి అనేది ఇప్పుడు మానవ జీవితంలో ఒక భాగం అయిపొయింది. మనం చాలా సార్లు పట్టించుకోం గాని పిల్లలో కూడా ఒత్తిడి ఉంటుంది. దాన్ని గుర్తించకపోతే.. వాళ్లలో ఆత్మవిశ్వాసం తగ్గడమే కాదు.. చదువుల్లోనూ వెనకబడే ప్రమాదం ఉంటుంది. అందుకే వాళ్లలో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. >> పగలంతా స్కూలు, సాయంత్రం సంగీతం, డాన్స్‌, ట్యూషన్‌.. ఇలా అన్నీ ఒకేసారి పెట్టేయడం వల్ల వాళ్లు క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు పిల్లలు. కానీ రోజూ అంతే బిజీగా ఉంచితే.. వాళ్లకంటూ ఓ ప్రపంచం ఉండదు. అదే ఒత్తిడికి దారితీయొచ్చు. అందుకే ఏ వ్యాపకం అయినా.. వారంలో రెండు మూడు రోజులు మాత్రమే ఉండేలా చూడండి. అలాగే చదువే వాళ్ల ప్రపంచం కాకుండా.. రోజూ కనీసం అరగంట నుంచి గంటవరకూ వాళ్లకు విరామం ఇవ్వండి. >> నిద్రమానేసి చదువుకోవాలీ.. అని పిల్లల నుంచి ఎప్పుడూ ఆశించొద్దు. ఎన్ని పనులున్నా.. నిద్రపోయే సమయానికి పూర్తయ్యేలా మీరు ప్రణాళిక వేసి.. వాళ్లు ఆచరించేలా చూడండి. వీలైనంత త్వరగా నిద్రపోవడం వల్ల ఒత్తిడిని తగ్గించే హార్మోను విడుదల అవుతుంది. అలా కూడా ఒత్తిడిని అదుపులో ఉంచొచ్చు. >> పొద్దుటి పూట ఇంట్లో వాతావరణం వీలైనంతవరకూ ప్రశాంతంగా ఉండేలా చూడండి. అంటే నిద్రలేచిన వెంటనే ‘వెళ్లి తయారవ్వూ..బుక్సు సర్దుకో..’ అంటూ కంగారు పెట్టకుండా.. అలాంటి పనులన్నీ ముందురోజే పూర్తిచేయండి. వీలైతే రోజూ పొద్దున్నే ఓ పది నిమిషాలు ధ్యానం చేయించండి. ఆ ప్రశాంతత వాళ్లకు రోజంతా ఉంటుంది.