ముగిసిన అభిశంసన తీర్మానం రచ్చ

SMTV Desk 2018-05-08 12:57:52  supreme court of india, cj justice deepak mishra, congress petition, delhi

ఢిల్లీ, మే 8 : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర అభిశంసన తీర్మానంను కాంగ్రెస్‌ ఎంపీలు వెనక్కి తీసుకున్నారు. అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న అభిశంసన వ్యవహారం ఊహించని మలుపులుతో చివరకు ధర్మాసనం కొట్టివేసింది. అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు నిన్న సుప్రీంకోర్టుకు వెళ్లారు. నేడు ఈ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే 45 నిమిషాల విచారణ అనంతరం ఈ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సహా ఏడు విపక్ష పార్టీలు ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసుపై 64 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేసి రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అందించారు. అయితే ఈ నోటీసును ఆయన తిరస్కరించారు. దీంతో ఉపరాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా ఈ అంశాన్ని మంగళవారం పరిశీలిస్తామని సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. అయితే కొద్ది గంటల్లోనే ఈ పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సీనియార్టీలో ఆరోస్థానంలో ఉన్న న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రి నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డె, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ ఎ.కె.గోయెల్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. అయితే పిటిషన్‌ను విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేయాలని ఎవరు ఆదేశించారు? అంటూ కాంగ్రెస్‌ ఎంపీల తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. ఆ ఆదేశాల కాపీ తమకు ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం సమ్మతించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీలు తమ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు.