15వ ఆర్థిక సంఘం తీరు మరింత బాధాకరం : సీఎం

SMTV Desk 2018-05-08 12:42:42  chandrababunaidu, ap cm ncn, ap colletors meeting, amaravathi

అమరావతి, మే 8 : 15వ ఆర్థిక సంఘం తీరును గమనిస్తే మరింత బాధ కలుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విభజన సందర్భంగా జరిగిన అన్యాయం కంటే ఈ నాలుగేళ్లలోనే రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "15వ ఆర్థిక సంఘం తీరును గమనిస్తే మరింత బాధ కలుగుతుంది. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటాననడం విచారకరం. జనాభా నియంత్రణ కోసం నాడు టీడీపీ హయాంలో తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలు సాధించం. 2011 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే దక్షిణ భారతానికి పార్లమెంటు సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. 14వ ఆర్థిక సంఘం 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంది. కొత్త ఆర్థిక సంఘం 2011 జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్రంకు మరింత నష్టం కలుగుతుంది. అటు విభజన వల్ల, ఇటు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.