మోదీ మూడేళ్ల ముచ్చట

SMTV Desk 2017-05-29 14:21:36  modi,3 years bjp adminstration,failed admistration

హైదరాబాద్ , మే 29 : మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంఘ్ శక్తుల నైతిక బలం పెరిగింది. చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకొని అరాచకాలు సృష్టిస్తున్నా కేం ద్రం చోద్యం చూస్తున్నది. ప్రజల్లో సెంటిమెంట్లను ప్రేరేపిస్తూ దేశభక్తి, దేశద్రోహం అంశాలను తెరపైకి తెచ్చింది. అసహనం పెరిగిపోయింది. మనిషి ప్రాణం కన్నా గోవు ప్రాణమే విలువైంది. తిన్నది గోవు మాంసం అవునో కాదో తెలియదు గానీ, ముందస్తుగానే ఒక నిర్ణయానికి వచ్చి మనుషుల ప్రాణాలను తీసేస్తున్నారు. పోలీసు వ్యవస్థ కంటే గోరక్షక్ వ్యవస్థే క్రియాశీలకంగా పని చేస్తున్నది. దళితుల పట్ల వివక్ష కూడా ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. మైనార్టీల్లో అభద్రతాభావం గురించి చెప్పాల్సిన పనే లేదు. హిందూ శక్తుల ఏకీకరణ ప్రక్రియ అప్రతిహతంగా జరిగిపోతున్నది. రామమందిరం, ట్రిపుల్ తలాక్, హిందూ మహిళలు సంతానం పెంచాలి. ఇలా పలు అంశాలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్య లు దేశంలోనే ఒక భిన్న సామాజిక అశాంతికి ఆజ్యం పోస్తున్నాయి. ముందు వరుసలో తెలంగాణ: మోదీ ప్రభుత్వంతో పోల్చుకుంటే తెలంగాణ సాధిస్తున్న ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు పూర్వానుభవం లేకపోయినా ఉద్యమం ద్వారా సాధించిన రాష్ర్టాన్ని, అదే స్ఫూర్తితో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అనుగుణంగా రూపొందించిన పథకాలు అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నాయి. మిషన్ కాకతీయ పథకాన్ని స్వయంగా కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రశంసించి కరువుపీడిత ప్రాంతాల్లో దీన్ని అమలు చేయడంపై అనేక రాష్ర్టాలకు సూచనలిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక పడకగది ఇండ్లను మంజూరు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కుటుంబాల్లోని ఆచరణాత్మక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంజూరుచేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఫసల్ బీమా యోజన, భూసార గుర్తింపు కార్డులు.. ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. కానీ మౌలిక పరిస్థితుల్లో మాత్రం ఏ మార్పు రాలేదు. ఇప్పటికీ రైతులకు కనీస గిట్టుబాటు ధరలేదు. ఆత్మహత్యలు ఆగలేదు. వివిధ కారణాలతో పంట నష్టం జరిగినా, భీమా సంస్థల నుంచి సకాలంలో చెల్లింపులు లేవు. ఏటా ఏదో ఒక వాణిజ్య పంటకు మార్కెట్ ధర లేకపోవడంతో రైతులు చితికిపోతున్నారు. రాష్ర్టాలు మొరపెట్టుకుంటున్నా సకాలంలో స్పందించడంలేదు. కరువు సహాయక నిధులు సైతం రాష్ర్టా ల ప్రతిపాదనలకు అనుగుణంగా విడుదల కావడం లేదు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు యూపీఏ హయాంతో పోలిస్తే పెద్దగా తగ్గలేదు. గణాంకాల ప్రకారం జీడీపీ పెరిగిందని, ద్రవ్యోల్బణం తగ్గిందని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, ప్రజల కొనుగోలు శక్తిగానీ, జీవన ప్రమాణాలు గానీ పెరుగలేదు. ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు, స్వచ్ఛభారత్, స్మార్ట్ సిటీస్.. ఇలాంటి పథకాల్లో లక్ష్యానికీ ఫలితాలకూ చాలా అంతరం ఉన్నది. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ పదేపదే వల్ల వేస్తున్నా తెలంగాణ, ఏపీ రాష్ర్టాల పట్ల కేంద్రం అవలంబిస్తున్న వైఖరి మరో రకంగా ఉంటున్నది.