బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

SMTV Desk 2018-05-06 12:50:31  Gopal Parma bjp mla, Madhya Pradesh mla gopal parmar, love jihad, mla bhopal

భోపాల్, మే 6 : బీజేపీ నేతలకు వారి అధిష్టానం ఎంత చెప్పిన నేతల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువును, ప్రతిష్టను దిగజారుస్తున్నారు. మహాభారతం సమయంలోనే ఇంటర్నెట్‌ ఉందంటూ ఇటీవల త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ చేసిన వ్యాఖ్యలు ఎంతో దుమారమే రేపాయి. తాజాగా మధ్యప్రదేశ్ బీజేపీ నేత, శాసన సభ్యుడు గోపాల్ పర్మార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడ పిల్లలకు సకాలంలో వివాహం చేయాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఆలస్య వివాహాల వల్ల ‘లవ్ జిహాద్’ వంటివి జరుగుతున్నాయని చెప్పారు. మధ్య ప్రదేశ్‌లోని అగర్ మాల్వా నియోజకవర్గం ఎమ్మెల్యే గోపాల్ పర్మార్ మాట్లాడుతూ..."పెద్దలు తమ పిల్లలకు బాల్యంలోనే వివాహాలు కుదిర్చేవారు.. ఆ బంధం ఎక్కువ కొనసాగేది. పద్దెనిమిదేళ్ళ రోగం చట్టబద్ధమైనప్పటి నుంచి చాలామంది ఆడ పిల్లలు లేచిపోవడం మొదలుపెట్టారు" అని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఆడపిల్లలకు వివాహం చేయాలంటే వారి వయసు 18 సంవత్సరాలు నిండాలని చట్టం చెప్తున్న నేపథ్యంలో గోపాల్ ఈ నిబంధనను ఓ రోగంగా పేర్కొన్నారు. బాలికలకు యవ్వనం వచ్చిన తర్వాత, వారి మనసులు చంచలంగా సంచరిస్తాయన్నారు. వాళ్ళ తల్లులు ‘లవ్ జిహాద్’ గురించి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు.