ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దారు

SMTV Desk 2018-05-05 13:21:38  Mahaboobnagar, Deputy thahasildar, caught by Acb

మహబూబ్‌నగర్, మే 5‌: రేషన్‌ డీలర్ల నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దారు కృష్ణమోహన్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్న కృష్ణమోహన్‌... మద్దూరు, గండేడ్‌, దామరగిద్ద మండలాలకు సైతం ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గండేడ్‌ మండల పరిధిలోని 34 రేషన్‌ షాపుల్లో 260 క్వింటాళ్ల బియ్యానికి సంబంధించి ఆవకతవకల నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వకుండా ఉండేందుకు రూ.7లక్షలు లంచం ఇవ్వాల్సిందిగా డీలర్లను డిమాండ్‌ చేశారు. అనంతరం వారు 5లక్షలు ఇచ్చేందుకు రేషన్‌ డీలర్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కృష్ణమోహన్‌కు లంచం ఇవ్వడం ఇష్టంలేని సదరు డీలర్లు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనతో ఒప్పందంలో భాగంగా ముందస్తుగా లక్ష రూపాయలు ఇస్తామని కృష్ణమోహన్‌కు చెప్పారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని తన ఇంటి వద్ద డీలరు నుంచి లక్ష రుపాయాలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని వలపన్ని పట్టుకున్నారు.